Begin typing your search above and press return to search.

ప్ర‌ధానికి ప్రివ్యూ.. దిల్లీకి సైరా టీమ్

By:  Tupaki Desk   |   23 Oct 2019 2:17 PM GMT
ప్ర‌ధానికి ప్రివ్యూ.. దిల్లీకి సైరా టీమ్
X
మెగాస్టార్ చిరంజీవి న‌టించిన `సైరా - న‌ర‌సింహారెడ్డి` తెలుగు రాష్ట్రాల్లో ఘ‌న‌విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. అంత‌కుమించి ఈ సినిమాకి క్రిటిక్స్ స‌హా సినీ..రాజ‌కీయ రంగ ప్ర‌ముఖుల ప్ర‌శంస‌లు ద‌క్కాయి. తెలంగాణ‌ గ‌వ‌ర్న‌ర్‌ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్.. భాజ‌పా నాయ‌కుడు వెంక‌య్య నాయుడు సైరా చిత్రం చూసి ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. తొలి త‌రం స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ పాత్ర‌లో మెగాస్టార్ చిరంజీవి న‌ట‌న‌పై ప్ర‌శంస‌లు కురిపించారు. ఏపీ ముఖ్యమంత్రి వై.య‌స్.జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సైతం సైరా చిత్రం స‌క్సెస్ కు శుభాకాంక్ష‌లు తెలిపారు.

స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడిగా మెగాస్టార్ అద్వితీయ న‌ట‌న గురించి గ‌ల్లీ నుంచి దిల్లీ వ‌ర‌కూ చ‌ర్చ సాగింది. బాలీవుడ్ క్రిటిక్స్ స్టాండింగ్ ఓవేష‌న్ ఇచ్చారంటే అర్థం చేసుకోవ‌చ్చు. ఆ క్ర‌మంలోనే మెగాస్టార్ చిరంజీవి దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీకి ఈ చిత్రాన్ని చూపించాల‌ని ఆశ‌ప‌డ్డారు. అందుకు పీఎంవోలో అపాయింట్ మెంట్ కోసం ప్ర‌య‌త్నించారు. అయితే అప్ప‌టికే మోదీ ఎన్నిక‌ల హ‌డావుడిలో ఉన్నారు. హ‌ర్యానా-మహారాష్ట్ర‌లో అసెంబ్లీ ఎల‌క్ష‌న్స్ ప్ర‌చారంలో బిజీగా ఉండ‌డంతో అపాయింట్ మెంట్ దొర‌క‌లేదు. ప్ర‌స్తుతం ఆ హ‌డావుడి ముగిసింది. వెంట‌నే సైరా హీరో-నిర్మాత‌లైన చిరు-చ‌ర‌ణ్ ల‌ను పీఎం మోదీ దిల్లీకి ఆహ్వానించార‌ని తెలుస్తోంది. అక్క‌డ `సైరా` స్పెషల్ ప్రివ్యూని ప్ర‌ధాని వీక్షించ‌నున్నార‌ట‌.

ఇటీవ‌లే మ‌హాత్మాగాంధీ జ‌యంతి సంద‌ర్భంగా స్వ‌చ్ఛ‌భార‌త్ కి తెలుగు స్టార్ల‌ను మోదీ ఆహ్వానించ‌క‌పోవ‌డంపై మెగా కోడ‌లు ఉపాస‌న గుర్రుమ‌న్న సంగ‌తి తెలిసిందే. నేరుగా ప్ర‌ధాని మోదీనే నిల‌దీస్తూ ఓ లేఖ‌ను రాశారు. దానికి అప్ప‌టిక‌ప్పుడు ప్ర‌ధాని స్పందించ‌క‌పోయినా .. ఇప్పుడిలా స్పందించార‌ని భావించ‌వ‌చ్చేమో!. ప్ర‌స్తుతం మారుతున్న రాజ‌కీయ స‌మీకర‌ణాల నేప‌థ్యంలో మెగాస్టార్ చిరంజీవి మైండ్ లో ఏదైనా కొత్త గేమ్ అమ‌ల్లో ఉందా? అందుకే మోదీని క‌ల‌వ‌బోతున్నారా? అంటూ స్పెక్యులేష‌న్ మొద‌లైంది. ఇంత‌కుముందే చిరును భాజ‌పాలో చేరాల్సిందిగా పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ్ మాధ‌వ్ ఆహ్వానించారు. కానీ అప్పుడు చేర‌లేదు. మునుముందు చిరు ఆలోచ‌న మార్చుకుంటున్నారా? అన్నది చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ప్ర‌స్తుతం మోదీతో మీటింగ్ కేవ‌లం సైరా ప్రివ్యూ వ‌ర‌కేనా? ఇంకేదైనా రాజ‌కీయ ప్రాధాన్య‌త సంత‌రించుకోనుందా? అంటూ మెగాభిమానుల్లో ఆస‌క్తి నెల‌కొంది.