Begin typing your search above and press return to search.

ప్లాస్మా దానం.. మెడిక‌ల్ మాఫియా.. హీరోలు స్పందించ‌రా?

By:  Tupaki Desk   |   17 July 2020 9:00 PM IST
ప్లాస్మా దానం.. మెడిక‌ల్ మాఫియా.. హీరోలు స్పందించ‌రా?
X
ర‌క్త‌దానం మ‌హాదానం.. లాక్ ‌డౌన్ ‌తో బతుకు తెరువు కోల్పోయి రోడ్డునపడ్డ నిరుపేదల కడుపులు నింపడానికి ఎందరో దాతలు ముందుకొచ్చారు. అన్నం వండిపెట్టారు.. నిత్యావసరాలు పంచారు. ఇళ్లల్లో ఒంటరిగా ఉంటున్న వృద్ధులకు బాసటగా కొందరు నిలిస్తే కార్మికుల‌ను స్వ‌స్థ‌లాల‌కు చేర్చేందుకు మ‌రికొంద‌రు కృషి చేశారు. ముఖ్యంగా టాలీవుడ్ ప్ర‌ముఖులు మ‌హ‌మ్మారీ క్రైసిస్ వేళ స్పందించిన తీరు ప్ర‌శంస‌నీయం.

మెగాస్టార్ చిరంజీవి.. మెగా ఫ్యామిలీ హీరోలు స‌హా నాగార్జున‌.. బాల‌కృష్ణ‌.. గోపిచంద్.. ఇలా ప్ర‌తి ఒక్క‌రూ స్పందించారు. చేత‌నైన సాయం చేశారు. ఇక సీసీసీ పేరుతో తెలుగు సినీకార్మికుల్ని ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి ముందుకొచ్చిన సంగ‌తి విధిత‌మే. కార్మికుల‌కు నిత్యావ‌స‌రాల పంపిణీకి సీసీసీ న‌డుం క‌ట్టింది. మ‌రోవైపు లాక్ డౌన్ స‌మ‌యంలో ర‌క్త‌దానం ఆగిపోవ‌డంతో పేషెంట్స్ మ‌ర‌ణిస్తున్నారంటూ చిరు వీడియో సందేశం ఇచ్చి ర‌క్తాన్ని విరివిగా దాన‌మివ్వాల్సిందిగా ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు.

చిరు స‌హా ఇత‌ర స్టార్ హీరోలు ర‌క్త‌దానంపై పిలుపునివ్వ‌డంతో కొంత‌వ‌ర‌కూ స్పంద‌న క‌నిపించింది. ఇక ఇప్పుడు ఆ స్టేజ్ ని మించి క‌రోనా పేషెంట్ల‌కు రక్త ప్లాస్మా దానం అవ‌స‌రం ప‌డుతోంది. దీంతో శ్రీ‌విష్ణు లాంటి యువ‌హీరో ప‌లువురు సాటి హీరోల‌కు ప్లాస్మా దానంపై ప్ర‌చారం చేయాల్సిందిగా ఆన్ లైన్ ఛాలెంజ్ విసిరారు. ఆ త‌ర్వాత ఎస్.ఎస్.రాజ‌మౌళి లాంటి దిగ్గ‌జం బ‌రిలో దిగి ప్లాస్మా దానానికి కోలుకుని కోవిడ్ నెగెటివ్ వ‌చ్చిన‌ రోగులు ముందుకు రావాల్సిందిగా కోరారు. ప్లాస్మా దానానికి భ‌య‌ప‌డాల్సిన ప‌నే లేదని భ‌రోసానిచ్చారు.

కేవ‌లం శ్రీ‌విష్ణు.. రాజ‌మౌళి ప్ర‌చారం చేస్తే స‌రిపోదు. ఇప్పుడున్న ప‌రిస్థితిలో ఆస్పత్రుల్లో అల్ల‌క‌ల్లోలంగా ఉంది. దేశ‌వ్యాప్తంగా.. తెలుగు రాష్ట్రాల్లోనూ ర‌క్త ప్లాస్మా చికిత్స కీల‌కంగా మారిన ఈ ద‌శ‌లో సీరియ‌స్ పేషెంట్ల ప్రాణాలు గాల్లో క‌లిసిపోకుండా ఆపాలంటే చికిత్స తీసుకుని కోలుకున్న పేషెంట్ల‌ను ప్లాస్మా దానానికి ప్రేరేపించాల్సి ఉంటుంది. ప్లాస్మా దానం ఇప్పుడు మ‌హాదానం. ప్రాణాల్ని నిల‌బెట్టే దానం. ఈ విష‌యాన్ని అంద‌రికీ అర్థ‌మ‌య్యేలా చెప్పాల్సిన బాధ్య‌త ఉంది. ఇది కేవ‌లం చిరంజీవి.. బాల‌కృష్ణ లాంటి బ్లడ్ బ్యాంకులు న‌డిపే హీరోలే కాదు.. ప్ర‌తి ఒక్క హీరో బాధ్య‌త‌గా భావించి ప్ర‌చారం చేస్తే ఎంతో మేలు చేసిన వారే అవుతారు. స్టార్ హీరోలు.. యంగ్ హీరోలే కాదు.. ఇత‌ర‌ సెల‌బ్రిటీలు బాధ్యతాయుత ప్ర‌చారం చేస్తే బావుంటుంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

దిల్లీ నుంచి గ‌ల్లీ వ‌ర‌కూ ప్లాస్మా అవ‌స‌రం. తెలంగాణ‌.. ఏపీలోనూ ప్లాస్మా అవ‌స‌రం ప‌డిన రోగులెంద‌రో ఉన్నార‌ట‌. మ‌రి వీళ్లంద‌రినీ ఆదుకునేందుకు ఇప్ప‌టికే ప్లాస్మా డోన‌ర్స్ కోసం వేచి చూస్తున్నార‌ట‌. మ‌రి వీరికోసం సెల‌బ్స్ స్వ‌చ్ఛందంగా ప్ర‌చారం చేస్తే బావుంటుందేమో.. ఇక ప్ర‌యివేటు ఆస్ప‌త్రులు మెడిక‌ల్ షాపుల మాఫియాలు పెట్రేగి ప్ర‌తిదీ బ్లాక్ మార్కెట్ చేసేస్తుండ‌డంతో సామాన్యుల‌కు రోగం వ‌స్తే త‌ట్టుకునే ప‌రిస్థితి లేదు. దీనిపైనా స‌ద‌రు స్టార్లు విస్త్ర‌తంగా ప్ర‌చారం చేసి జ‌న‌జాగృతం చేయాల్సిన ప‌రిస్థితి ముందుంది.