Begin typing your search above and press return to search.

నందమూరి హీరోలతో 'NBK' అనే మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారా..?

By:  Tupaki Desk   |   30 Jun 2021 2:30 AM GMT
నందమూరి హీరోలతో NBK అనే మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారా..?
X
ఒకే సినిమాలో తమ అభిమాన ఫ్యామిలీ హీరోలు కలసి స్క్రీన్ షేర్ చేసుకుంటే చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటుంటారు. ఇప్పుడు అక్కినేని మూడు తరాల హీరోలు కలిసి 'మనం' వంటి క్లాసిక్ అందించారు. మెగా హీరోలు కూడా అవకాశం వచ్చినప్పుడల్లా ఒకే చిత్రంలో నటిస్తున్నారు. దగ్గుబాటి హీరోల మల్టీస్టారర్ కు కూడా ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఇప్పుడు నందమూరి హీరోల మల్టీస్టారర్ వార్తల్లోకి వచ్చింది.

'పీఎస్వీ గరుడవేగ' ఫేమ్ ప్ర‌వీణ్ సత్తారు నంద‌మూరి ఫ్యామిలీ హీరోలతో ఓ మ‌ల్టీస్టార‌ర్ చేస్తున్నాడనే న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రానికి 'NBK' అనే టైటిల్ అనుకుంటున్నారని.. 'N' అంటే ఎన్టీఆర్ - 'B' అంటే బాలకృష్ణ - 'K' అంటే కళ్యాణ్ రామ్ అని అర్థం వచ్చేలా ఈ టైటిల్ ని పెడతారని నందమూరి కాంపౌండ్ లో ఈ రూమర్స్ గట్టిగానే వినిపిస్తున్నాయి. అయితే ప్రవీణ్ సత్తారు దగ్గర మల్టీస్టారర్ ఐడియా ఉంది నిజమే అనుకున్నా.. ఇది ఏ మేరకు వర్కౌట్ అవుతుంది అనేది చూడాలి.

బాలయ్య - ఎన్టీఆర్ మధ్య దూరం పెరిగిందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇటీవలే తారక్ పొలిటికల్ ఎంట్రీపై బాలకృష్ణ స్పందన చూసి ఇది నిజమేనని అందరూ అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బాబాయ్ - అబ్బాయ్ ల కాంబినేషన్ లో మల్టీస్టారర్ సాధ్యమేనా అనే అనుమానాలు వస్తున్నాయి. కాకపోతే ఆ మధ్య బాలయ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మంచి కథ కుదిరితే ఖచ్చితంగా మల్టీ స్టారర్ చేస్తామని.. చాలా మంది మల్టీస్టారర్ కథలను చెప్పారు కానీ అంతగా నచ్చలేదని.. మల్టీస్టారర్ అంటే 'షోలే' సినిమా అంత భారీగా బ్రహ్మాండంగా ఉండాలని తన మనసులోని మాటను వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో నందమూరి హీరోల 'ఎన్.బి. కె' మల్టీస్టారర్ ముందుకు వెళ్తుందా.. లేదా ఎప్పటిలాగే రూమర్ గా మిగిలివుతుందా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఒకవేళ నిజంగానే బాలకృష్ణ - ఎన్టీఆర్ - కళ్యాణ్ రామ్ ఒకే సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంటే మాత్రం నందమూరి అభిమానులు పండుగ చేసుకోవ‌డం ఖాయమని చెప్పాలి.