Begin typing your search above and press return to search.

సంక్రాంతి బొమ్మలు ఇంటర్నెట్ లో హల్ చల్

By:  Tupaki Desk   |   14 Jan 2020 4:58 AM GMT
సంక్రాంతి బొమ్మలు ఇంటర్నెట్ లో హల్ చల్
X
కోట్లాది రూపాయిలు ఖర్చు పెట్టి.. నెలల తరబడి శిల్పాన్ని చెక్కిన దర్శకుడు.. ఎన్నో ఆశలు.. ఆకాంక్షలతో పని చేసిన హీరోహీరోయిన్లకు షాకులే కాదు.. నిర్మాతలకు గుండె నొప్పి వచ్చేలా పైరసీదారులు చెలరేగిపోతున్నారు. సినిమాలు రిలీజ్ అవుతుంటే చాలు.. పైరసీ మాఫియా ఎంతలా చెలరేగిపోతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా.. విడుదలైన సంక్రాంతి మూవీలు దర్బార్.. సరిలేరు నీకెవ్వరు.. అల వైకుంఠపురములో.. ఇలా పండక్కి వెండితెర మీద వెలిగిపోతున్న బొమ్మలన్ని ఇంటర్నెట్ లోకి వచ్చేసిన వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది.

పండక్కు వచ్చిన సినిమాలు.. అధికారిక షో వేసిన కొన్ని గంటల వ్యవధిలోనే పైరసీ సీడీలు.. ఇంటర్నెట్ లో వెబ్ లింకులు బయటకు వచ్చేశాయి. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ దర్బార్ మూవీ అయితే.. రిలీజ్ అయిన రోజే అటు మార్కెట్ లోకి సీడీల రూపంలోనూ.. ఇటు ఆన్ లైన్ లోకి లింకుల రూపంలో వచ్చేయటంతో నిర్మాతలకు గుండె జారిపోయిన పరిస్థితి.

ఇదిలా ఉంటే..దర్బార్ తో పోలిస్తే.. తెలుగు చిత్రాలు సరిలేరు నీకెవ్వరు.. అల వైకుంఠపురము చిత్రాలు కాస్త ఆలస్యంగా పైరేటెడ్ సీడీలు.. లింకులు బయటకు వచ్చేయటం కలకలంగా మారుతోంది. భారీ ఆశల్ని వమ్ము చేస్తూ బయటకు వచ్చిన పైరసీ మీద చిత్ర పరిశ్రమ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. పైరసీ మీద ఎంత పోరాడుతున్నా.. అవేమీ పని చేయకుండా సినిమా విడుదలైన గంటల వ్యవధిలోనే మార్కెట్లోకి రావటాన్ని పలువురు తప్పు పడుతున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా దర్బార్ చిత్రానికి సంబంధించి మరో షాకింగ్ నిజం బయటకు వచ్చింది. తెలుగులో పెద్దగా ఆదరణ లేకున్నా.. తమిళంలో మాత్రం భారీ కలెక్షన్లను కొల్లగొడుతుందని చెబుతున్నారు. అయితే.. తాజాగా దర్బార్ చిత్రాన్ని కేబుల్ టీవీలో టెలికాస్ట్ చేయటం.. అది కూడా హెచ్ డీ క్వాలిటీతో ఉండటాన్ని దర్శక నిర్మాతల నోట మాట రావటం లేదు. ఈ విషయం గురించి తెలుసుకున్న దర్బార్ నిర్మాణ సంస్థ లైకా.. వెంటనే పోలీసుల్ని సంప్రదించి ఫిర్యాదు చేసింది.

పైరసీ పెనుభూతంగా మారటమే కాదు.. కళ్ల ముందే తాము పడిన కష్టాన్ని పైరసీ మట్టి పాలు చేయటాన్ని నిర్మాత.. దర్శకులు జీర్ణించుకోలేకపోతున్నారు. పైరసీ లింకులు.. సీడీల్ని ఎవరైనా గుర్తిస్తే.. తమకు అప్పజెప్పాలని కోరుతున్నారు దర్శన నిర్మాతలు. ఓపక్క టికెట్ల కోసం థియేటర్ల బయట ప్రేక్షకులు కొట్టుకు చస్తుంటే.. మరోవైపు ఎంచక్కా ఇంటర్నెట్ లో హడావుడి చేస్తున్న వైనం ఇప్పుడు పెద్ద దిగులుగా మారింది.