Begin typing your search above and press return to search.

ఏపీలో థియేట‌ర్లు తెరిచేందుకు అనుమ‌తులు స‌రే.. టిక్కెట్టు పెంపు?

By:  Tupaki Desk   |   5 July 2021 9:30 AM GMT
ఏపీలో థియేట‌ర్లు తెరిచేందుకు అనుమ‌తులు స‌రే.. టిక్కెట్టు పెంపు?
X
క‌రోనా మొద‌టి వేవ్ స‌మ‌యంలో ఏడెనిమిది నెల‌లు ఎగ్జిబిష‌న్ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఆ త‌ర్వాత 2020 డిసెంబ‌ర్ నాటికి టాలీవుడ్ లో సినిమాలు రిలీజ‌య్యాయి. 50శాతం ఆక్యుపెన్సీతో రిలీజైనా ర‌వితేజ‌- సాయి ధ‌ర‌మ్ తేజ్ లాంటి స్టార్ల చిత్రాలు చ‌క్క‌ని వ‌సూళ్ల‌ను సాధించాయి. ఆ త‌ర్వాత సంక్రాంతి బ‌రిలో వ‌చ్చిన సినిమాలు వ‌సూళ్ల‌తో అద‌ర‌గొట్టాయి. ఉప్పెన‌- జాతిర‌త్నాలు బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్ట‌డంతో పెద్ద ఊపొచ్చింది. నాంది లాంటి చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో వ‌సూళ్ల ప‌రంగా రాణించ‌డం హుషారు పెంచింది.

అయితే ఇంత‌లోనే మార్చి 2021 నాటికి ప‌రిస్థితి మారిపోయింది. క‌రోనా సెకండ్ వేవ్ తీవ్ర‌త‌రం అవ్వ‌డంతో మ‌రోసారి స్వ‌చ్ఛందంగా థియేట‌ర్ల‌ను మూసేశారు. ఎగ్జిబిష‌న్ రంగానికి బ్యాక్ టు బ్యాక్ బిగ్ పంచ్ ప‌డింది.. ఈ రంగంలో ఎంద‌రో ఉపాధిని కోల్పోయారు. అయితే తిరిగి థియేట‌ర్ల‌ను తెర‌వాలంటే ఎగ్జిబిట‌ర్లు ర‌క‌ర‌కాల షాకులు చెప్పారు. 50శాతంతో ర‌న్ చేయ‌లేమ‌ని .. ఏపీలో టిక్కెట్టు ధ‌ర‌ల త‌గ్గింపుతో గిట్టుబాటు కాద‌ని .. ఇంకా థియేట‌ర్ల‌కు జనం వ‌స్తారో రారో అనే డౌట్లు ఉన్నాయ‌ని ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాలు ఇబ్బందిక‌రంగా మారాయి. అయితే గ‌త కొంత‌కాలంగా ఓటీటీల‌కు సినిమాల విక్ర‌యం ఎగ్జిబిట‌ర్ల‌ను తీవ్రంగా క‌ల‌వ‌ర‌పెట్టింది.

దీంతో తాము థియేట‌ర్లు తెరిచేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని సంకేతాలిచ్చారు. ఇటీవ‌లే తెలంగాణ ఫిలింఛాంబ‌ర్ నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి ఓ లేఖ పంపిన సంగ‌తి తెలిసిందే. ఇందులో ఏపీలో టిక్కెట్టు ధ‌ర‌ల పెంపు గురించి అభ్య‌ర్థ‌న వేడి పెంచింది. ఇరు రాష్ట్రాల్లో టిక్కెట్టు ధ‌ర‌లు ఒకేలా ఉండాల‌నేది వారి ఉద్ధేశం. అయితే ఏపీ స‌ర్కార్ అందుకు సిద్ధంగా ఉందా లేదా? అన్న‌ది ఇంకా వెల్ల‌డి కాలేదు. కానీ ఈలోగానే ఏపీలో 50శాతం ఆక్యుపెన్సీతో థియేట‌ర్లు తెరుచుకోవ‌చ్చ‌ని స‌ర్కార్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. జూలై 8 నుంచి థియేట‌ర్లు తెరుచుకోనున్నాయి. అయితే సినిమాల్ని రిలీజ్ చేసేందుకు నిర్మాత‌లు సిద్ధంగా ఉన్నారా? అంటే ఇంకా దీనిపైనా సందిగ్ధ‌త నెల‌కొంది. ఇప్ప‌టికి షూటింగులు జ‌రుగుతున్నాయి. చాలామంది త‌మ సినిమాల రిలీజ్ ల‌కు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నారు. ఇక ఏపీలో థియేట‌ర్లు తెరిస్తే టిక్కెట్టు ధ‌ర‌లు పాత‌వే ఉంటాయా? కొత్త‌గా మారిన‌వే కొన‌సాగుతాయా? అన్న‌దానిపైనా స్ప‌ష్ఠ‌త రావాల్సి ఉంది.