Begin typing your search above and press return to search.

వర్మ దగ్గరకు రోజూ అంతమంది ఎన్ వోసీ అడుగుతారట

By:  Tupaki Desk   |   25 Nov 2019 11:45 AM IST
వర్మ దగ్గరకు రోజూ అంతమంది ఎన్ వోసీ అడుగుతారట
X
తాను అనుకున్నది అనుకున్నట్లుగా సినిమా తీసేందుకు ఏ మాత్రం మొహమాట పడరు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ. సంచలన అంశాల్ని సినిమాలుగా తీసే వర్మ.. ఇటీవల కాలంలో వర్తమాన రాజకీయాల్ని బేస్ చేసుకొని సినిమాలు తీస్తుండటం తెలిసిందే. వివాదాలతో సహవాసం చేసే ఆయన తాజాగా నిర్మించిన చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు.

టైటిల్ చూస్తేనే.. సినిమా లో ఏముంటుందో అర్థమయ్యే పరిస్థితి. దీనికి తగ్గట్లే ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు.. పాటలు వివాదానికి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఈ సినిమాను ఈ వారం (నవంబరు 29న) రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రస్తుతం ఈ సినిమా మీద కోర్టులో కేసు నడుస్తోంది. కోర్టు తీర్పుకు తగ్గట్లుగా విడుదల ఉంటుందంటున్నారు.

ఇదిలా ఉంటే.. తాజా చిత్రంలోని పాత్రధారుల పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు.. లోకేశ్.. పవన్ కల్యాణ్ పాత్రలకు తగ్గట్లు సినిమా లో పాత్రలు ఉన్నాయని.. వీటిని పిలిచే వైనం పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. తన సినిమాలో పాత్రధారుల కూ ఏపీ రాజకీయ నేతల కు ఏ మాత్రం సంబంధం లేదంటున్నారు.
అన్నింటికంటే బాబు.. లోకేశ్.. పవన్ లకు ఈ సినిమాలో ఎలాంటి లింకు లేదని.. సినిమాలోని పాత్రల్ని చూసి అలా అనుకుంటే తాను మాత్రం ఏమీ చేయలేనని చెబుతున్నారు. తన గురించి ఎవరేం రాసినా పట్టించుకోనని.. తనకు అనవసరంగా ఆయన చెబుతున్నారు. ఈ సందర్భంగా ఆసక్తి కర వ్యాఖ్య ఒకటి చేశారు. రోజూ ముంబయికి వచ్చి చాలామంది తన దగ్గర నో అబ్జెక్షనబుల్ సర్టిఫికేట్ (ఎన్ వోసి) తీసుకుంటారని.. అలా తీసుకున్న వారు ఏం రాసినా పట్టించుకోనని చెప్పారు. ఒకవేళ ఎన్ వోసీ తీసుకోకుండా రాసినా తాను లైట్ తీసుకుంటానని చెబుతున్న వర్మ మాటలు ఇప్పుడు ఆసక్తి కరంగా మారాయి. ఇంత కీ వర్మ ను ముంబయి వెళ్లి రోజూ అంతమంది కలుస్తారా?