Begin typing your search above and press return to search.

పెన్సిల్.. ఈ థ్రిల్లరేదో బాగున్నట్లుందే

By:  Tupaki Desk   |   9 April 2016 5:25 AM GMT
పెన్సిల్.. ఈ థ్రిల్లరేదో బాగున్నట్లుందే
X
త్రిష లేదా నయనతార సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించాడు మ్యూజిక్ డైరెక్టర్ టర్న్డ్ హీరో జి.వి.ప్రకాష్ కుమార్. ఐతే ఆ సినిమాతో మన ప్రేక్షకుల్ని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయిన జి.వి. ఈసారి ఓ మంచి థ్రిల్లర్ తో వస్తున్నాడు. జి.వి.ప్రకాష్ కుమార్-శ్రీదివ్య జంటగా నటించిన ‘పెన్సిల్’ ట్రైలర్ హీరో సూర్య చేతుల మీదుగా రిలీజైంది. డిస్ట్రిబ్యూటర్ హరి నిర్మాతగా మారి ఈ చిత్రాన్ని తెలుగులో అందిస్తున్నాడు. మణి నాగరాజ్ అనే దర్శకుడు రూపొందించిన ‘పెన్సిల్’ మంచి థ్రిల్లర్ లక్షణాలున్న సినిమాలాగా అనిపిస్తోంది. ట్రైలర్ చాలా ఆసక్తికరంగా అనిపిస్తోంది.

సినిమా అంతా ఒకే ఒక స్కూల్లోనే అయిపోతుంది. ముందు హీరో హీరోయిన్ల మధ్య లవ్ నేపథ్యంలో సినిమా మొదలై.. ఆ తర్వాత థ్రిల్లర్ టర్న్ తీసుకునేలా ఉంది. స్కూల్లో జరిగిన ఓ హత్య నేపథ్యంలో మిస్టరీ మొదలవుతుంది. ఆ హత్యను హీరోనే చేశాడని అందరూ అనుకుంటారు. హీరోయిన్ కూడా అలాగే అనుమానిస్తుంది. కానీ ఈ మర్డర్ వెనుక మిస్టరీ వేరే ఉంటుంది. దాన్ని హీరో ఎలా ఛేదించాడన్నదే అసలు కథ. ట్రైలర్ చూస్తుంటే ద్వితీయార్ధమంతా చాలా ఉత్కంఠభరితంగా సాగేలా కనిపిస్తోంది. ఈరోస్ ఇంటర్నేషనల్ లాంటి పెద్ద సంస్థ నిర్మాణ భాగస్వామిగా ఉన్న ఈ చిత్రాన్ని ఏప్రిల్లోనే ప్రేక్షకుల ముందుకు తేబోతున్నారు. తమిళ-తెలుగు భాషల్లో ఒకేసారి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది.