Begin typing your search above and press return to search.

'పెళ్లి సందD' టైటిల్ సాంగ్: దర్శకేంద్రుడి మార్క్ పెళ్లి పాట..!

By:  Tupaki Desk   |   12 Aug 2021 12:13 PM IST
పెళ్లి సందD టైటిల్ సాంగ్: దర్శకేంద్రుడి మార్క్ పెళ్లి పాట..!
X
శ‌తాధిక చిత్రాల దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తెరకెక్కించిన మ్యూజికల్ బ్లాక్ బస్టర్ 'పెళ్లిసందడి'. అయితే ఈ సినిమా వచ్చిన పాతికేళ్ల తర్వాత ''పెళ్లి సందD'' అనే ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ సినిమాతో వస్తున్నారు రాఘవేంద్రరావు. గౌరీ రోనంకి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దర్శకేంద్రుడు స్క్రీన్ ప్లే అందిస్తూ దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాతో న‌టుడిగా తెరంగ్రేటం చేస్తున్నారు.

''పెళ్లి సందD'' చిత్రంలో సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తుండగా.. శ్రీలీల హీరోయిన్‌ గా పరిచయం అవుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని ‘ప్రేమంటే ఏంటీ..’ ‘బుజ్జులు’ పాటలు మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా 'పెళ్లి సందD' టైటిల్ సాంగ్ ని చిత్ర బృందం విడుదల చేసింది.

'పట్టుచీరల తళతళలు.. పట్ట గొలుసుల గలగలలు.. పూల చొక్కాల రెపరెపలు.. సిల్కు పంచెల టపటపలు.. గాజులపేరుల ధగదగలు..' అంటూ సాగిన ఈ పాటను రాఘవేంద్ర రావు శైలిలో చిత్రీకరించారు. పెళ్లి నేపథ్యంలో సాగిన ఈ గీతం కలర్ ఫుల్ గా ఆహ్లాదకరంగా ఉంది. పెళ్లి వేడుకలో హీరోహీరోయిన్లతో పాటుగా ఇతర ప్రధాన తారాగణంతో నిండుగా ఉన్న ఈ సాంగ్ వీక్షకులను అలరిస్తోంది.

'పెళ్లి సందD' టైటిల్ సాంగ్ కు ఎమ్ ఎమ్ కీరవాణి బాణీలు సమకూర్చారు. గేయ రచయిత చంద్రబోస్ క్యాచీ లిరిక్స్ అందించారు. హేమచంద్ర - దీపు - రమ్య బెహరా కలిసి ఈ హుషారైన గీతాన్ని ఆలపించారు. దీనికి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. రాఘవేంద్రరావు అన్నీ దగ్గరుండి చేసుకున్నట్లు ఈ లిరికల్ వీడియో చూస్తే అర్థం అవుతోంది.

ఏదేమైనా రాఘవేంద్రరావు - కీరవాణి - చంద్రబోస్ కలయికలో మరో మ్యూజికల్ హిట్ రాబోతోందని ఇప్పటి వరకు విడుదలైన మూడు పాటలు చెబుతున్నాయి. 'పెళ్లి సందD' చిత్రానికి సునీల్ కుమార్‌ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తుండగా.. త‌మ్మిరాజు ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. కిరణ్ కుమార్ మన్నే ఆర్ట్ డైరెక్టర్ గా.. శ్రీధర్ సీపాన సంభాషణల రచయితగా ఉన్నారు.

కె. కృష్ణ‌మోహ‌న్ రావు‌ సమర్పణలో ఆర్‌.కె. ఫిలిం అసోసియేట్స్‌ - ఆర్కా మీడియా వర్క్స్‌ బ్యానర్స్ పై ఈ సినిమా రూపొందుతోంది. మాధవి కోవెలమూడి - శోభు యార్లగడ్డ - ప్రసాద్‌ దేవినేని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 25 ఏళ్ల క్రితం వచ్చిన 'పెళ్లి సందడి' తరహాలోనే 'పెళ్లి సందD' చిత్రం కూడా సక్సెస్ అవుతుందేమో చూడాలి.