Begin typing your search above and press return to search.

'పెళ్లి సందD' ట్రైలర్ లాంచ్ తో సందడి షురూ చేసిన మహేష్..!

By:  Tupaki Desk   |   22 Sep 2021 6:12 AM GMT
పెళ్లి సందD ట్రైలర్ లాంచ్ తో సందడి షురూ చేసిన మహేష్..!
X
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న రొమాంటిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ''పెళ్లి సందD''. సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ - శ్రీ లీలా జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి గౌరీ రోనంకీ దర్శకత్వం వహిస్తున్నారు. రాఘవేంద్రరావు స్క్రీన్ ప్లే అందించడమే కాకుండా.. ఈ సినిమాతో తొలిసారి వెండితెర మీద సందడి చేయబోతున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు.. ఇటీవల వచ్చిన టీజర్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా 'పెళ్లి సందD' ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశారు.

''రాఘవేంద్రరావు గారు వెండితెర అరంగేట్రం చేస్తున్న 'పెళ్లి సందD' ట్రైలర్ లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆయనకు మరియు మొత్తం చిత్ర బృందానికి శుభాకాంక్షలు'' అని మహేష్ బాబు పేర్కొన్నారు. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. పెళ్లి నేపథ్యంలో భారీ తారాగణంతో సినిమా అంతా సందడి సందడిగా సాగుతుందనిపిస్తోంది. ఇది కామెడీతో పాటు లవ్ - యాక్షన్ - ఎమోషన్స్ కలబోసిన ఎంటర్టైనర్ అని అర్థం అవుతోంది. అంతేకాదు ఇందులో స్పోర్ట్స్ నేపథ్యాన్ని కూడా టచ్ చేసినట్లు ట్రైలర్ ని బట్టి తెలుస్తోంది.

'పెళ్లి సందD' చిత్రంలో ప్రకాష్ రాజ్ - రాజేంద్రప్రసాద్ - రావు రమేష్ - తనికెళ్ళ భరణి - పోసాని కృష్ణ మురళి - వెన్నెల కిషోర్ - రాజీవ్ కనకాల - హేమ - ప్రగతి - ఝాన్సీ - శ్రీనివాస్ రెడ్డి - షకలక శంకర్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇక ఈ ట్రైలర్ లో రాఘవేద్రరావు కూడా కనిపించి అందరిని కనివిందు చేశారు. రోషన్ ఈ సినిమాలో డాన్స్ - ఫైట్స్ బాగా చేయడంతో పాటుగా మంచి నటన కనబరిచాడు. డెబ్యూ హీరోయిన్ శ్రీ లీల తన అందంతో ఆకట్టుకుంటోంది.

దసరా కానుకగా ''పెళ్లి సందD'' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. పాతికేళ్ళ క్రితం శ్రీకాంత్ హీరోగా రాఘవేంద్రరావు తెరకెక్కించిన 'పెళ్ళిసందడి' సినిమా మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ తో దర్శకేంద్రుడు చేస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఈ చిత్రాన్ని కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు శ్రోతలను విశేషంగా అలరిస్తున్నాయి.

కె. కృష్ణ‌మోహ‌న్ రావు‌ సమర్పణలో ఆర్‌.కె. ఫిలిం అసోసియేట్స్‌ - ఆర్కా మీడియా వర్క్స్‌ బ్యానర్స్ పై ఈ సినిమా రూపొందుతోంది. మాధవి కోవెలమూడి - శోభు యార్లగడ్డ - ప్రసాద్‌ దేవినేని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సునీల్ కుమార్‌ సినిమాటోగ్ర‌ఫీ అందించిన ఈ చిత్రానికి త‌మ్మిరాజు ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. కిరణ్ కుమార్ మన్నే ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. శ్రీధర్ సీపాన ఈ చిత్రానికి డైలాగ్స్ రాశారు. త్వరలోనే ''పెళ్లి సందD'' విడుదల తేదీని ప్రకటించనున్నారు.