Begin typing your search above and press return to search.

కొంపదీసి సల్మాన్ ఆ పాత్ర చేస్తాడా?

By:  Tupaki Desk   |   6 Aug 2016 9:06 AM GMT
కొంపదీసి సల్మాన్ ఆ పాత్ర చేస్తాడా?
X
సల్మాన్ ఖాన్ మన తెలుగు సినిమాలకు రుణపడి ఉండాలి. పదేళ్ల కిందట పూర్తిగా గాడి తప్పిన అతడి కెరీర్ మళ్లీ పట్టాలెక్కి.. స్పీడందుకుందంటే అందుకు తెలుగు సినిమాలే కారణం. ‘పోకిరి’ సినిమాను ‘వాంటెడ్’గా రీమేక్ చేసి చాలా ఏళ్ల తర్వాత ఓ సూపర్ హిట్ కొట్టి నిలదొక్కుకున్న సల్మాన్.. ఆ తర్వాత రెడీ.. కిక్ రీమేకులతోనూ మంచి విజయాలే అందుకున్నాడు. ‘కిక్’ తర్వాత వరుసగా స్ట్రెయిట్ సినిమాలే చేస్తూ వస్తున్న సల్మాన్.. ఈ మధ్యే తెలుగులో చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన థ్రిల్లర్ మూవీ ‘క్షణం’ మీద కన్నేశాడు. ఆ రీమేక్ ను హిందీలో భారీ స్థాయిలో చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఆ సినిమాను సల్మాన్ స్వయంగా నిర్మించబోతున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే తాజాగా సల్మాన్ మరో చిన్న తెలుగు సినిమా మీద కన్నేసినట్లు వార్తలొస్తున్నాయి. గత వారం విడుదలై సెన్సేషనల్ హిట్టయిన ‘పెళ్లిచూపులు’ మీద సల్మాన్ ఆసక్తి చూపిస్తున్నాడట. ఈ వీకెండ్ లో అతను ఆ సినిమా ప్రత్యేకంగా షో వేయించుకుని చూడబోతున్నట్లు కూడా వార్తలొస్తున్నాయి. దీని గురించి వార్తలు బయటికి రాగానే కొంపదీసి ఈ సినిమాను సల్మాన్ హీరోగా రీమేక్ చేస్తారా.. 50 ఏళ్ల వయసొచ్చినా ఇంకా పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్ గా ఉన్న సల్మాన్.. పెళ్లిచూపులకు వెళ్లే కుర్రాడిలా కనిపిస్తాడా అంటూ సెటైర్లు వేస్తున్నారు జనాలు. బహుశా సల్మాన్ అంత సాహసం చేయకపోవచ్చులెండి. జస్ట్ రీమేక్ రైట్స్ తీసుకుని తన బేనర్లో ఎవరైనా యంగ్ హీరో హీరోయిన్లతో రీమేక్ చేసే అవకాశముంది. ఈ చిన్న సినిమాకు హిందీతో పాటు తమిళం.. మలయాళ భాషల నుంచి కూడా రీమేక్ రైట్స్ కోసం గట్టి పోటీ ఉన్నట్లు సమాచారం.