Begin typing your search above and press return to search.

‘పెళ్లిచూపులు’ను ఎక్కడికో తీసుకెళ్తున్నారు

By:  Tupaki Desk   |   14 Aug 2016 9:30 AM GMT
‘పెళ్లిచూపులు’ను ఎక్కడికో తీసుకెళ్తున్నారు
X
సినిమాలో విషయం ఉన్నంత మాత్రాన ఆడేస్తుందని గ్యారెంటీ లేదు. కొన్ని మంచి సినిమాలు కూడా పోతుంటాయి. కొన్ని మామూలు సినిమాలు కూడా ఆడేస్తుంటాయి. ఓ సినిమా ఎలాంటి టైమింగ్‌ లో రిలీజైందన్నది కూడా కొన్నిసార్లు కీలక పాత్ర పోషిస్తూ ఉంటంది. ‘బిచ్చగాడు’ సినిమా ఇంకెప్పుడైనా రిలీజై ఉంటే జనాలు పట్టించుకునేవాళ్లు కాదేమో. నిజానికి ఏప్రిల్ 13న ఈ సినిమా రిలీజైనపుడు కూడా జనాలు లైట్ తీసుకున్నారు. కానీ తర్వాతి వారం ‘బ్రహ్మోత్సవం’ డిజాస్టర్ కావడం.. ‘బిచ్చగాడు’ ఆల్టర్నేట్‌ గా కనిపించడంతో అనుకోకుండా ఆ సినిమా చూశారు. అది ఊహించని రేంజికి వెళ్లిపోయింది.

ఇక రెండు వారాల కిందట విడుదలైన ‘పెళ్లిచూపులు’కు కూడా ఇలాగే భలేగా కలిసొస్తోంది. దానికి పోటీగా రిలీజైన ‘జక్కన్న’ పేలవమైన టాక్ రావడం దీనికి బాగా అడ్వాంటేజ్ అయింది. తర్వాతి వారం శ్రీరస్తు శుభమస్తు.. మనమంతా సినిమాలకు కూడా మంచి టాక్ వచ్చినా దీనికి దెబ్బేమీ పడలేదు. ఆ సినిమాల కంటే దీనికే ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి. ముఖ్యంగా అమెరికాలో ఈ సినిమాకు ఎదురే లేకపోయింది. ఇక ఈ శుక్రవారం వచ్చిన బాబు బంగారం.. తిక్క.. రెంటికీ నెగెటివ్ టాక్ రావడంతో ‘పెళ్లిచూపులు’ పంట పండినట్లయింది. ‘బాబు బంగారం’కు ఫస్ట్ డే మంచి కలెక్షన్లు వచ్చాయి. రెండో రోజు డ్రాప్ అయ్యాయి. ‘తిక్క’కు అయితే ఓపెనింగ్సే లేవు. దీంతో ఈ వీకెండ్లో కూడా ‘పెళ్లిచూపులు’ జనాలకు ఫస్ట్ ఛాయిస్ అవుతోంది. గత వారం వచ్చిన ‘శ్రీరస్తు శుభమస్తు’ ఓ మోస్తరు కలెక్షన్లతో సాగుతుండగా.. ‘మనమంతా’ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. దాని థియేట్రికల్ రన్ ఈ వీకెండ్‌ తోనే దాదాపు ముగిసిపోయే పరిస్థితి వచ్చేసింది. పెళ్లిచూపులు మాత్రం బాక్సాఫీస్ లీడర్ గా కంటిన్యూ అవుతోంది.