Begin typing your search above and press return to search.

పెళ్లిచూపులు.. కొత్త ట్రైలర్ వచ్చింది

By:  Tupaki Desk   |   9 Jan 2017 8:39 AM GMT
పెళ్లిచూపులు.. కొత్త ట్రైలర్ వచ్చింది
X
ఐదారు నెలల కిందటే రిలీజై అదిరిపోయే వసూళ్లు సాధించి.. టాలీవుడ్ ను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసిన ‘పెళ్లిచూపులు’ సినిమాకు ఇప్పుడు కొత్తగా ట్రైలర్ రిలీజ్ చేయడం ఏంటి అనుకుంటున్నారా..? ఇది తెలుగు వెర్షన్ కు సంబంధించి కాదులెండి. ఈ చిత్రం ఇప్పుడు మలయాళంలోకి వెళ్తోంది. ‘ఒరు పెన్ కానల్ కథ’ పేరుతో ‘పెళ్లిచూపులు’ చిత్రాన్ని మలయాళంలోకి అనువాదం చేశారు. డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసి ఈ నెలలోనే సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందు ట్రైలర్ లాంచ్ చేశారు. తెలుగులో ‘పెళ్లిచూపులు’ కోసం తయారు చేసిన ట్రైలర్నే మలయాళంలోకి తర్జుమా చేశారు. అక్కడి జనాల్ని ఈ ట్రైలర్ బాగానే ఆకట్టుకుంటున్నట్లుగా ఉంది.

సునీల్.ఎ.కె. ఈ చిత్రాన్ని మలయాళ ప్రేక్షకులకు అందిస్తున్నాడు. మలయాళంలో ‘పెళ్లిచూపులు’ తరహా న్యూ వేవ్ సినిమాలు గత కొన్నేళ్లలో మంచి విజయం సాధిస్తున్నాయి. అర్బన్ బేస్డ్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీలు అక్కడ అదరగొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆలస్యం చేయకుండా ఈ చిత్రాన్ని మలయాళంలోకి అనువాదం చేశారు. మరోవైపు పెళ్లిచూపులు తమిళ రీమేక్ కోసం గౌతమ్ మీనన్ సన్నాహాలు మొదలుపెట్టేశాడు. ఇందులో తమన్నా కథానాయికగా నటిస్తోంది. గౌతమ్ శిష్యుడు సెంథిల్ వీరాస్వామి దర్శకత్వం వహిస్తాడు. హీరో సంగతి తేలాల్సి ఉంది. హిందీలో ప్రముఖ నిర్మాత వశు భగ్నాని ఈ చిత్ర రీమేక్ హక్కులు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/