Begin typing your search above and press return to search.

'రొమాంటిక్' సాంగ్.. 'పీనే కే బాద్' అంటూ పూరీ ఆకాష్..!

By:  Tupaki Desk   |   12 Oct 2021 6:14 AM GMT
రొమాంటిక్ సాంగ్.. పీనే కే బాద్ అంటూ పూరీ ఆకాష్..!
X
డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ''రొమాంటిక్''. పూరీ శిష్యుడు అనిల్ పాదూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. దీనికి పూరీ కథ - స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందించడం విశేషం. ఇందులో ఆకాశ్ సరసన కేతిక శర్మ హీరోయిన్ గా నటించింది. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా ఎప్పుడో కంప్లీట్ అయింది. అయితే కరోనా పరిస్థితుల ప్రభావం వల్ల ఇన్నాళ్లూ విడుదలకు నోచుకోలేదు. ఇప్పుడు థియేట్రికల్ బిజినెస్ ఆశాజనకంగా ఉండటంతో ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా రిలీజ్ చేస్తున్నారు.

'రొమాంటిక్' మూవీని నవంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రమోషనల్ కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్న మేకర్స్.. వరుస అప్డేట్స్ వదలడానికి రెడీ అయ్యారు. తాజాగా 'పీనే కే బాద్' అనే సాంగ్ లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు. 'హ్యాపీ హ్యాపీ మామా.. దిల్ కుష్ అయితదే.. పీనే కే బాద్.. రావే అంటే రాదా.. స్వర సంగీతమే..' అంటూ సాగిన ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంటోంది.

యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కశ్యప్ ఈ సాంగ్ కు ట్యూన్ సమకూర్చారు. తెలుగు హిందీ ఇంగ్లీష్ పదాల కలయికతో గేయ రచయిత భాస్కర భట్ల ఈ పాటకు క్యాచీ లిరిక్స్ అందించాడు. ఈ సాంగ్ లో డ్రింక్ చేస్తూ పూరీ ఆకాష్ వేసిన స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయి. దీనికి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. నరేష్ రానా సినిమాటోగ్రఫీ అందించగా.. జానీ షేక్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. జునైద్ సిద్దిఖీ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.

'రొమాంటిక్' చిత్రం నుంచి ఇది వరకే విడుదలైన పోస్టర్స్ మరియు రెండు పాటలు విశేష స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో లేటెస్ట్ గా వచ్చిన 'పీనే కే బాద్' సాంగ్ కూడా అలరిస్తోంది. ఈ చిత్రంలో సీనియర్ నటి రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించగా.. మకరంద్ దేశ్ పాండే - ఉత్తేజ్ - సునయన ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. లావణ్య సమర్పణలో పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్ మరియు పూరీ కనెక్ట్స్ బ్యానర్స్ పై 'రొమాంటిక్' సినిమా రూపొందుతోంది. 'ఇస్మార్ట్ శంకర్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పూరి జగన్నాధ్ - ఛార్మి కౌర్ కలిసి నిర్మిస్తున్న 'రొమాంటిక్' సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.