Begin typing your search above and press return to search.

కాస్త కథను పట్టించుకోండి సామీ!

By:  Tupaki Desk   |   30 March 2022 12:30 AM GMT
కాస్త కథను పట్టించుకోండి సామీ!
X
నితిన్ టీనేజ్ లోనే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు .. టీనేజ్ లో ఉండగానే వరుస ఫ్లాపులు చూశాడు. ఆత్మవిశ్వాసంతో అడుగుముందుకు వేస్తూ, ఆ తరువాత విజయాలను అందుకున్నాడు. 'భీష్మ' సినిమాతో నితిన్ కి మంచి హిట్ పడింది. ఆ సినిమాలో ఆయన మరింత హ్యాండ్సమ్ గా కనిపించడమే కాకుండా, ఇక నితిన్ దార్లో పడిపోయాడు అనుకునేలా చేశాడు. కానీ ఆ తరువాత ఆయన ఎంత ఫాస్టుగా 3 సినిమాలను పూర్తి చేశాడో .. అంతే ఫాస్టుగా ఫ్లాపులను మూటగట్టుకున్నాడు.'చెక్' .. 'రంగ్ దే' .. 'మాస్ట్రో' సినిమాలు పూర్తి నిరాశను కలిగించాయి.

ఇక శర్వానంద్ విషయానికి వస్తే, 'మహానుభావుడు' తరువాత ఇంతవరకూ ఆయన కి హిట్ లేదు. ' రణరంగం' .. ' జాను' .. 'శ్రీకారం' .. 'మహాసముద్రం' .. 'ఆడవాళ్లు మీకు జోహార్లు' ఇలా వరుస ఫ్లాపులను పోషిస్తూ వెళుతున్నాడు. జోనర్లు మార్చుకుంటూ వెళుతున్నా ప్రయోజనం కనిపించడం లేదు.

డిఫరెంట్ లుక్స్ ట్రై చేయడానికి ఇష్టపడని శర్వానంద్, తన అభిమానులను నిరాశ పరుస్తూ వెళుతున్నాడు. నాని తరువాత స్థానంలో కనిపించే శర్వానంద్, అక్కడి నుంచి జారిపోవడం మొదలై చాలా కాలమైంది. ఈ విషయాన్ని ఆయన కూడా ఈ పాటికి గ్రహించే ఉంటాడు.

ఇదే జాబితాలో కనిపించే మరో పేరు నాగశౌర్య. మంచి హైటూ .. అందుకు తగిన పర్సనాలిటీతో ఆయన లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. సినిమాకి .. సినిమాకి మధ్య పెద్ద గ్యాప్ లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అయితే సక్సెస్ అనేది మాత్రం ఆయనకి కనిపించకుండా తప్పించుకుంటోంది. సిక్స్ ప్యాక్ తో చేసిన 'లక్ష్య' .. హ్యాండ్సమ్ లుక్ తో చేసిన 'వరుడు కావలెను' కూడా ప్రేక్షకులను ఎంతమాత్రం ఆకట్టుకోలేకపోయాయి.ఇక కార్తికేయ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు.

ప్రతి సినిమా హిట్ కావాలనేం లేదు .. హిట్ కొట్టడానికి అనుసరించవలసిన ఫార్ములా ఎవరూ కనిపెట్టలేదు. కానీ కథా కథనాలపై కసరత్తు జరగాలి. సినిమాకి .. సినిమాకి కొత్తగా కనిపించడానికి ట్రై చేస్తూ, తమని తాము కొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం జరగాలి. మాటలు .. పాటలపై ప్రత్యేకమైన దృష్టిపెట్టాలి. కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వడం మంచిదే.

అయితే ఆ ప్రాజెక్టుకు సంబంధించి చివరి నిమిషం వరకూ వాళ్లతోనే జర్నీ చేయాలి. ఒక సినిమా థియేటర్ కి వెళ్లిన తరువాత ఏమీ చేయలేము .. చేసేదేమైనా ఉంటే అంతకుముందే చేసేయాలనే సీనియర్స్ బాటలో ముందుకు వెళ్లాలి. అలా చేస్తే వరుస హిట్లు రాకపోయినా, వరుస ఫ్లాపుల నుంచి మాత్రం తప్పించుకోవచ్చు.