Begin typing your search above and press return to search.

OG లో సుజీత్ అలాంటి మిస్టేక్ రిపీట్ చేయ‌డు క‌దా?

By:  Tupaki Desk   |   17 Jun 2023 4:57 PM IST
OG లో సుజీత్ అలాంటి మిస్టేక్ రిపీట్ చేయ‌డు క‌దా?
X
భారీ కాస్టింగ్.. భారీ బ‌డ్జెట్లు.. భారీత‌నం నిండిన కాన్సెప్ట్ ఎంచుకుని సినిమాలు తీయ‌డం సాహ‌సంతో కూడుకున్న ప‌నే. స‌వాళ్లు ఎన్నో ఎదుర‌వుతాయి. స్క్రీన్ ప్లే ప‌రంగా పాత్ర‌ల్ని మ‌ల‌చ‌డంలో ఎక్క‌డ లోటుపాట్లు క‌నిపించినా అది సినిమాకి పెద్ద మైన‌స్ గా మారుతుంది. సాహో లాంటి భారీ యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ సినిమాని సాంకేతికంగా అత్యున్న‌త స్థాయిలో చూపించ‌గ‌లిగిన సుజీత్ .. ఆ చిత్రంలో ఒక‌రిని మించి ఒక‌రైన‌ దిగ్గ‌జన‌టుల్ని ఎంపిక చేసుకుని వారి పాత్ర‌ల‌కు పూర్తి స్థాయి ఔచిత్యాన్ని క‌ల్పించ‌డంలో స‌ఫ‌లం కాలేక‌పోయాడు. స్క్రీన్ ప్లే ప‌రంగా ఎంతో ఇంటెలెక్చువ‌ల్ గా డీల్ చేయాల‌నుకున్నది ఆశించిన విధంగా వ‌ర్క‌వుట్ కాలేదు. దీంతో అందులో భారీ తారాగ‌ణాన్ని ఆశించిన స్థాయిలో ఉప‌యోగించుకోలేక‌పోయాడ‌ని విమ‌ర్శ‌లొచ్చాయి.

జాకీష్రాఫ్ - చంకీ పాండే- మ‌హేష్ మంజ్రేక‌ర్- మందిరా భేఢీ- నీల్ నితిన్ -అరుణ్ విజ‌య్ ... ఇలా భారీ కాస్టింగ్ తో భారీ సాహ‌స‌మే చేశాడు సుజీత్. అయితే ఇంత‌మంది పాత్రధారుల్ని వారి స్థాయికి త‌గ్గ స్క్రీన్ స్పేస్ తో ఎలివేట్ చేయ‌డంలోనే కొంత త‌డ‌బ‌డ్డాడు. దానికి తోడు స్క్రీన్ ప్లేలో ఆశించిన‌ది కుద‌ర‌క‌పోవ‌డం కూడా ఇబ్బంది పెట్టింది. వెర‌సి సాహో ఒక కిచిడీగా మారింద‌ని విమ‌ర్శ‌లొచ్చాయి.

ఇప్పుడు `సాహో` త‌ర‌హాలో ఓజీకి సుదీప్ భారీ కాస్టింగ్ ని ఎంపిక చేసుకున్నాడు. జాతీయ ఉత్త‌మ నటుడు ప్రకాష్ రాజ్ - మేటి త‌మిళ నాయిక‌ శ్రీయా రెడ్డి .. మాస్టర్ ఫేమ్ అర్జున్ దాస్ లను కీలక పాత్రల్లోకి తీసుకోవ‌డ‌మే గాక‌.. ప్ర‌ధాన విలన్ గా ఇమ్రాన్ హష్మీని తీసుకున్నారు. సుజీత్ ఈ ప్రతిభావంతులైన నటులకు వారి స్థాయికి త‌గ్గ పాత్రలను ఆఫ‌ర్ చేయ‌డ‌మే గాక స్క్రీన్ స్పేస్ ని కూడా ఎక్కువ‌గా ఇవ్వాల్సి ఉంటుంది. అంటే దీన‌ర్థం ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ పాత్ర నిడివికి కూడా అది చెక్ పెట్ట‌డ‌మే. గొప్ప న‌టుల్ని ఎంపిక చేసుకున్న‌ప్పుడు ప్ర‌తి పాత్ర‌ధారికి సార్థ‌క‌త అవ‌స‌రం. అంటే వారికి త‌గిన స్క్రీన్ స్పేస్ ఇవ్వాలి. పాత్ర‌ను అంతే బ‌లంగా తీర్చిదిద్దాలి. అతిథి పాత్ర‌లా తీసి పారేస్తే అది ఆడియెన్ కి క‌నెక్ట్ కాద‌ని ప్రూవైంది గ‌తంలో. ఇకపోతే ఓజీలో ప‌వ‌న్ క‌ల్యాణ్ పూర్తి లెంగ్తీ పాత్ర‌లో కాదు కానీ ప్రభావ‌వంత‌మైన పాత్ర‌లో న‌టిస్తున్నాడని గుస‌గుస కూడా ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. ఏది ఏమైనా ఓజీపై ప‌వ‌న్ అభిమానులు స‌హా అంద‌రిలోను భారీ అంచ‌నాలున్నాయి.

ఎక్కువ మంది ప్ర‌ధాన స్ర‌వంతి న‌టీన‌టుల‌ను తీస్కున్నా ప్ర‌తి పాత్ర‌కు ప్ర‌త్యేక‌త‌ను ఆపాదించ‌డంలో సుజీత్ ఫెయిల‌వ్వ‌డ‌నే ఆశిద్దాం. సాహోలో అన్ని పాత్ర‌లు వ‌స్తూ పోతూ ఉంటాయి.. ఓజీలో అలా కాకూడ‌ద‌న్న సూచ‌న‌ను స్వీక‌రిస్తాడ‌నే అభిమానులు ఆశిస్తున్నారు. సుజీత్ లో ప్ర‌తిభ‌కు కొద‌వేమీ లేదు. చిన్న పాటి లోపాల్ని స‌వ‌రించుకుని ఈసారి స‌రైన బ్లాక్ బ‌స్ట‌ర్ ని సాధించేందుకు అన్నివిధాలా కృషి చేస్తున్నాని అభిమానులు ఆశిస్తున్నారు.