Begin typing your search above and press return to search.

భీమ్లానాయక్ నిర్మాతల ప్లానింగ్ సరిగా లేదా?

By:  Tupaki Desk   |   1 Feb 2022 7:30 AM GMT
భీమ్లానాయక్ నిర్మాతల ప్లానింగ్ సరిగా లేదా?
X
భారీ సినిమా విడుదల విషయంలో ఎంత ముందుచూపు ఉండాలి? ఎవరెన్ని చెప్పినా సినిమా అన్నది ఫక్తు కమర్షియల్ వ్యవహారం. రాగద్వేషాలకు సంబంధం లేకుండా.. తమ ప్రొడక్టును పక్కాగా అమ్ముకోవాల్సిన బాధ్యత సినిమా నిర్మాతదే. ఈ విషయంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన భీమ్లానాయక్ నిర్మాతలు అదే పనిగా తప్పులు చేస్తున్నారా? అన్నదిప్పుడు చర్చగా మారింది. రావాల్సిన టైంలో రాకుండా.. అతి మంచితనానికి పోయి దెబ్బేయించుకున్న భీమ్లానాయక్ నిర్మాతలకు.. ఒకసారి పడిన దెబ్బకు బుద్ధి రాలేదన్న మాట పవన్ అభిమానుల నోటి నుంచి వస్తోంది.

కొత్త సంవత్సరంలో రావాల్సిన సినిమాను.. రాజమౌళి ఆర్ఆర్ఆర్ కోసం త్యాగం చేయటాన్ని కొందరు సమర్థిస్తే.. మరికొందరు వ్యతిరేకించారు. సరే.. జరిగిందేదో జరిగిపోయింది. కానీ.. జరగాల్సిన విషయంలోనూ తప్పులు జరగటాన్ని పవన్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. కరోనా మూడో వేవ్ కేసులు భారీగా పెరిగి.. ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్న వేళ.. ముందుగా అనుకున్నట్లు ఫిబ్రవరి 25న విడుదలయ్యే అవకాశంపై తమకున్న కన్ఫ్యూజన్ ను చెప్పకనే చెప్పేశారు.

తమ సినిమాను ఫిబ్రవరి 25న లేదంటే ఏప్రిల్1న విడుదల చేస్తామని తాజాగా సితార ఎంటర్ ట్మైనెంట్ ప్రకటించింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫిబ్రవరి 25న విడుదల చేయటం అంత సరైన నిర్ణయం కాదన్న మాట వినిపిస్తోంది. ఎందుకంటే.. కేసుల తగ్గుదల మొదలైనా.. ఆ భావన అందరికి కలిగేసరికి ఫిబ్రవరి పది వరకు పడుతుందని.. గణాంకాల రూపంలోనూ కేసుల తగ్గుదల కనిపించటానికి తక్కువలో తక్కువ ఫిబ్రవరి 15 దాటిన తర్వాతే అంటున్నారు. కేసులు తగ్గిపోయాయన్న మాట వినిపించినంతనే జనాలు బయటకు రావటానికి అంత సుముఖంగా ఉండరు.

ఇప్పటికి రోడ్ల మీదకు వచ్చే వారు ఉన్నా.. సాధారణ పరిస్థితులు నెలకొనటానికి ఫిబ్రవరి మూడో వారం దాటిన తర్వాతే అన్న మాట వినిపిస్తోంది. ఒకవేళ.. సాహసం చేసి భీమ్లానాయక్ నిర్మాతలు ఫిబ్రవరి 25న తమ సినిమాను విడుదల చేస్తే.. పరిస్థితులు అంత సానుకూలంగా ఉండవని చెబుతున్నారు. అలా అని.. ఫిబ్రవరి 25న వదిలేసి.. తాజాగా ప్రకటించిన ఏప్రిల్ 1న విడుదల చేయటం కూడా సరికాదంటున్నారు. ఎందుకంటే.. రాజమౌళి ఆర్ఆర్ఆర్ విడుదలై కేవలం వారానికే భీమ్లానాయక్ మూవీ విడుదలైతే.. ఆ చిత్ర వసూళ్ల మీదనే కాదు.. భీమ్లానాయక్ కు అంతో ఇంతో ఎఫెక్టు ఖాయం. అంత పెద్ద సినిమాను వారానికే థియేటర్లకు పరిమితం చేయకుండా.. తక్కువలో తక్కువ రెండు వారాల పాటు ఉంచేందుకే ప్రాదాన్యత ఇస్తారు.

అలాంటప్పుడు థియేటర్లు లభించే విషయంలోనూ ఇబ్బందే. ఒకవేళ.. ఆర్ఆర్ఆర్ మాంచి టాక్ తో దూసుకెళుతున్న వేళలో.. భీమ్లానాయక్ విడుదలైతే.. ఆ హవా నుంచి ప్రేక్షకుల్ని టర్న్ చేయటం కష్టమవుతుంది. ఒకవేళ టర్న్ అయినా.. వందశాతం మాత్రం కాదు. అలా చూస్తే.. పవన్ సినిమాకు దెబ్బే. ఇదంతా చూసినప్పుడు అయితే ఆర్ఆర్ఆర్ కు రెండు వారాల ముందుకానీ.. లేదంటే ఆర్ఆర్ఆర్ కు రెండు వారాల తర్వాత కానీ రిలీజ్ డేట్ పై కర్చీఫ్ వేసి ఉంటే బాగుండేది.

అలాంటి ప్లానింగ్ ఏమీ లేకుండా.. ఆర్ఆర్ఆర్ విడుదలైన వారానికే రిలీజ్ డేట్ లాక్ చేయటం ఏ మాత్రం కరెక్టు కాదన్న వాదన వినిపిస్తోంది. మరోవైపు కేజీఎఫ్ 2 ఏప్రిల్ 14కు లాక్ చేసుకోవటం చూసినప్పుడు.. భీమ్లానాయక్ నిర్మాతలకు తమ సినిమా విడుదల విషయంలో సరైన వ్యూహంతో వ్యవహరించటం లేదన్న ఇరిటేషన్ పవన్ ఫ్యాన్స్ కు ఎక్కువ అవుతోంది. పవర్ ఫుల్ హీరోతో భారీ సినిమా తీయటంతో సరిపోదు.. అంతే పవర్ ఫుల్ గా రిలీజ్ ప్లానింగ్ ఉండాలన్నమాట వినిపిస్తోంది. ఈ విషయంలో భీమ్లానిర్మాతలు తప్పు మీద తప్పు చేస్తున్నారన్న అభిప్రాయం పలువురి నోట వినిపిస్తోంది.