Begin typing your search above and press return to search.

ఆ పండగను టార్గెట్ చేసిన పవన్

By:  Tupaki Desk   |   31 March 2023 12:08 PM GMT
ఆ పండగను టార్గెట్ చేసిన పవన్
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస పెట్టి సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ఒక వైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే మరోవైపు బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులు చేస్తున్నారు. ప్రస్తుతం సముద్రఖని డైరెక్షన్ లో చేస్తున్న వినోదయ సీతమ్ రీమేక్ జులై 28న రిలీజ్ కానుంది.

మరోవైపు క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వీటి తర్వాత హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఉస్తాద్ భగత్ సింగ్, సుజిత్ దర్శకత్వంలో ఓజీ సినిమాలు చేయనున్నారు. వీటిలో ఉస్తాద్ ముందుగా ప్రారంభంకానున్నట్లు తెలుస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై హరీష్ శంకర్ డైరెక్షన్ లో భారీ యాక్షన్ మూవీ తెరకెక్కనుంది ఉస్తాద్ భగత్ సింగ్. అయితే ఈ మూవీకి సంబంధించి తాజాగా అప్డేట్ వచ్చింది. ఉస్తాద్ భగత్ సింగ్ 2024 సంక్రాంతి బరిలో దిగనుందని సమాచారం.

ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు చాలా వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ గా ఆనంద్ సాయి పని చేస్తారు. పవన్ కళ్యాణ్ సరసన ఏ హీరోయిన్ నటించనుందో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇతర సాంకేతిక నిపుణుల గురించి కూడా తెలియాల్సి ఉంది.

అయితే 2024 సంక్రాంతి బరిలో ఇప్పటికే ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు తలపడనున్నాయి. త్రివిక్రమ్ - సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో వస్తున్న SSMB28 కూడా 2024 పొంగల్ బరిలో నిలిచింది. మరోవైపు నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రభాస్ చేస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రాజెక్ట్ కె కూడా 2024 సంక్రాంతి విడుదల చేస్తామని ఇప్పటికే మూవీ మేకర్స్ ప్రకటించారు.

ఇప్పుడు పవన్ కళ్యాణ్ మూవీ కూడా వస్తే ఈ పొంగల్ కు స్టార్ హీరోల త్రిముఖ పోరు తప్పదు. ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు ఒకే సమయంలో రిలీజ్ కావడం ఎవరికీ అంతగా మంచిది కాదని ఇండస్ట్రీ నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ మేకర్స్ నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.