Begin typing your search above and press return to search.

పవర్ స్టార్ మూవీలో మరో హీరోకి అవకాశమే లేకుండా చేస్తున్నారా..?

By:  Tupaki Desk   |   13 Nov 2020 4:20 PM IST
పవర్ స్టార్ మూవీలో మరో హీరోకి అవకాశమే లేకుండా చేస్తున్నారా..?
X
ఇటీవల పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ 'అప్పట్లో ఒకడుండేవాడు' ఫేమ్ సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో ఓ మూవీ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. అధికారికంగా మేకర్స్ ప్రకటించనప్పటికీ ఇది మలయాళ 'అయ్యప్పనుమ్ కోషియమ్' సినిమాకు తెలుగు రీమేక్ అని తెలుస్తోంది. బిజూ మీనన్ - పృథ్వీరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్కడ మంచి విజయాన్ని అందుకుంది. బిజూ మీనన్ పోషించిన నిజాయితీగల పోలీస్‌ ఆఫీసర్ పాత్రలో పవన్‌ కనిపించనున్నాడు. ఈ క్రమంలో పవన్ కి ధీటుగా నిలిచే మరో పాత్రలో ఎవరు నటిస్తున్నారనేది ఆసక్తికరంగా మారింది. దీని కోసం ఇప్పటికే అనేకమంది స్టార్ హీరోలను సంప్రదించినప్పటికీ ఎవరినీ ఫైనలైజ్ చేయలేదని తెలుస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ రూమర్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

మలయాళంలో సూపర్ హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కోశియమ్' చిత్రానికి తెలుగు రీమేక్ లో అయ్యప్ప ని హీరోగా.. కోశి ని విలన్ గా చూపించనున్నారట. అంటే పవన్ కళ్యాణ్ మాత్రమే ఈ సినిమాలో హీరోగా ఉంటారు. ఆయన క్యారక్టర్ కి పోటీగా ప్రధాన ప్రతినాయకుడి పాత్ర ఉంటుందన్నమాట. ఈ మేరకు స్క్రిప్ట్ లో మార్పులు చేయమని డైరెక్టర్ కి పవన్ సూచించాడని.. దీనికి తగ్గట్టుగా సాగర్ స్క్రిప్ట్ మళ్ళీ రాస్తున్నాడని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మలయాళ వర్షన్ హిట్ అవడానికి ప్రధాన కారణం ఇద్దరు హీరోల రోల్స్. కానీ తెలుగులో మాత్రం మల్టీస్టారర్ కాకుండా పవర్ స్టార్ సినిమాగా మారుస్తున్నారని అంటున్నారు. మరి ఇదే కనుక నిజమైతే తెలుగులో ఈ మూవీ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఈ సినిమాపై ప్రత్యేక ద్రుష్టి పెట్టడంతో పాటు డైలాగ్స్ కూడా అందిస్తున్నాడట. థమన్ సంగీతం సమకూర్చనున్నాడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రారంభంలో స్టార్ట్ చేసి సమ్మర్ లో రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది.