Begin typing your search above and press return to search.

నా కోసం కథలు రెడీ చేయమని నేను ఎవరినీ యాచించలేను: పవన్ కల్యాణ్

By:  Tupaki Desk   |   5 April 2021 3:30 AM GMT
నా కోసం కథలు రెడీ చేయమని నేను ఎవరినీ యాచించలేను: పవన్ కల్యాణ్
X
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా 'వకీల్ సాబ్' సినిమా రూపొందింది. బోనీకపూర్ సమర్పించిన ఈ సినిమాను 'దిల్' రాజు - శిరీష్ నిర్మించారు. హిందీలో భారీ విజయాన్ని సాధించడమే కాకుండా, విమర్శకుల నుంచి సైతం ప్రశంసలను అందుకున్న 'పింక్' సినిమాకి ఇది రీమేక్. అలాంటి ఈ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి బయటికి వచ్చిన టీజర్ .. ట్రైలర్ .. సాంగ్స్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 9వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ - శిల్పకళావేదికలో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.

ఈ వేదికపై పవన్ కల్యాణ్ మాట్లాడుతూ .. "సినిమా భాష మాట్లాడి చాలాకాలమైపోయింది .. బండ్ల గణేశ్ లా నేను మాట్లాడలేను. నా గుండె ఎప్పుడూ కూడా నా దేశం కోసం .. మీ కోసం కొట్టుకుంటుంది. అందువలన మూడేళ్లపాటు సినిమాలు చేయలేదనే భావన నాకు కలగలేదు. అలాగే ఇందాక ఎవరో అంటున్నారు నేను ఇండస్ట్రీలోకి వచ్చి 24 ఏళ్లు అయిందనీ, నేను పని చేసుకుంటూ వెళ్లిపోయాను .. ఇంతకాలమైందని నాకు తెలియదు. 'దిల్'రాజుగారిలా కలలను నిజం చేసుకునేవాళ్లంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయనతో ముందుగానే సినిమా చేసి ఉండవలసింది. కానీ నాతో సినిమా చేయండి .. కథ రెడీ చేయండి అని నేను యాచించలేను .. అది నా దురదృష్టం.

ఇందాక వేణు శ్రీరామ్ మాట్లాడుతూ తను ఒక టైలర్ కొడుకును అని అన్నారు. నా తండ్రి కూడా ఓ సాధారణమైన పోలీస్ కానిస్టేబుల్. అలాంటి స్థాయి నుంచి వచ్చిన నా దృష్టిలో ఏ వృత్తి ఎక్కువకాదు .. ఏ వృత్తి తక్కువా కాదు. వేణు శ్రీరామ్ కి నేను అవకాశం ఇవ్వలేదు. తను ఎంతో కష్టపడి స్వశక్తితో ఈ అవకాశాన్ని సంపాదించుకున్నాడు. ఆయన దర్శకత్వంలో చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నిజానికి నేను అసలు నటుడిని కావాలని అనుకోలేదు. ఎలాంటి గుర్తింపు లేకుండా చాలా చిన్న జీవితం గడపాలని నాకు ఉండేది.దిగువ మధ్యతరగతి జీవితం గడపాలని ఉండేది. అది తప్పా అన్నీ తీరాయి. ఈ జన్మకి ఇక చిన్నజీవితం గురించి మరిచిపొమ్మని త్రివిక్రమ్ చెప్పాక సెటిల్ అవ్వాల్సి వచ్చింది" అని చెప్పుకొచ్చారు.