Begin typing your search above and press return to search.

నాకు సిగ్గు అనిపించింది - పవన్

By:  Tupaki Desk   |   6 Nov 2016 9:26 PM GMT
నాకు సిగ్గు అనిపించింది - పవన్
X
కమెడియన్ సప్తగిరి హీరోగా నటించిన సప్తగిరి ఎక్స్ ప్రెస్ ఆడియో ఫంక్షన్ హైద్రాబాద్ లో జరిగింది. ఈ ఫంక్షన్ కు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని ముందే తెలిసినా.. అసలెందుకు వచ్చాడనే విషయం మాత్రం తానే చెప్పాడు పవన్

'సప్తగిరి కోసం ఈ ఫంక్షన్ కి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. నేను సహజంగా ఎక్కడికీ రాను కానీ.. మీ అందరి ప్రేమకు కచ్చితంగా స్పందిస్తాను.. అందుకే ఇక్కడికొచ్చాను. సప్తగిరి గబ్బర్ సింగ్ లో చేసిన చిన్న బిట్ నాకు బాగా నచ్చింది. అప్పటి నుంచి కలుసుకుందామని అనుకున్నాను.. ఇప్పటికి ఆ అవకాశం వచ్చింది. శరత్ మరార్ తో నేను తీసే సినిమాకి కాటమరాయుడు అనే టైటిల్ అంటే.. బావుంటుంది పెట్టమని చెప్పాను. నిర్మాత.. సప్తగిరి.. అరుణ్ పవార్ ది ఎంత మంచి మనసంటే.. 70 శాతం షూటింగ్ పూర్తయ్యాక వాళ్ల టైటిల్ మార్చుకుని ఇచ్చారు. నాకు ఇవన్నీ తెలీదు. తెలిశాక అడగొద్దని చెప్పాను.. అలా అడగడం కూడా నాకు సిగ్గు అనిపించింది. కానీ వాళ్లే వచ్చి విషయం చెప్పారు. కాటమరాయుడు టైటిల్ ఇచ్చిన నిర్మాత గారికి.. సప్తగిరి గారికి ధన్యవాదాలు' అంటూ అసలు విషయం చెప్పాడు పవన్.

''నేను సినిమాలు తక్కువగా చూస్తాను.. నా సినిమాలు కూడా 2-3 చూడలేదు. కానీ సప్తగిరి సినిమా చూడాలని అనుకుంటున్నా. ఆయన కామెడీ అందులో ఉండే ఎనర్జీ నాకు బాగా నచ్చుతుంది. నిర్మాతను అడిగి కచ్చితంగా ఒక షో వేసుకుని చూస్తాను. అరుణ్ పవార్ చాలా సంవత్సరాలుగా తెలుసు. త్రివిక్రమ్ కు సన్నిహితుడు. రోజు చూస్కుంటూ ఉంటాం కానీ మాట్లాడుకున్నది తక్కువ. సర్దార్ మూవీకి కూడా హెల్ప్ చేశారు. థియేటర్ కి వచ్చిన ప్రతీ ఒక్కరికీ ఆనందం ఈ సినిమా కలిగించాలని కోరకుంటాను'' అంటూ సప్తగిరి ఎక్స్ ప్రెస్ యూనిట్ కి అభినందనలు చెప్పాడు పవన్.

పవన్ మాట్లాడుతుంటే.. ఓ వ్యక్తి కాళ్ళకు దండం పెట్టేందుకు ప్రయత్నించాడు. దీంతో ''దండం పెట్టకు.. నాకు దండం పెడితే పారిపోయి పరిగెట్టాలని అనిపిస్తుంది. బాగా ఇబ్బందిగా అనిపిస్తుంది. జైహింద్'' అన్నాడు పవన్.