Begin typing your search above and press return to search.

బాబాయ్ ట్రెండ్ సెట్ చేశాడు.. మేము ఫాలో అవుతున్నామంతే!

By:  Tupaki Desk   |   7 April 2022 4:44 AM GMT
బాబాయ్ ట్రెండ్ సెట్ చేశాడు.. మేము ఫాలో అవుతున్నామంతే!
X
వరుణ్ తేజ్ ఇంతకుముందు చేసిన 'ఎఫ్ 2' .. ' గద్దలకొండ గణేశ్' భారీ విజయాలను నమోదు చేశాయి. ఇక తప్పకుండా హ్యాట్రిక్ హిట్ కొట్టాలనే ఉద్దేశంతో ఆయన చేసిన సినిమానే 'గని'. ఇది బాక్సింగ్ నేపథ్యంలో జరిగే కథ. బాక్సర్ పాత్ర కోసం వరుణ్ తేజ్ విదేశాలకి వెళ్లి మరీ ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్నాడు. ఈ నెల 8వ తేదీన ఈ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ స్టేజ్ పై వరుణ్ తేజ్ మాట్లాడుతూ .. " ఇది మూడు సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన సినిమా .. మరికొన్ని గంటల్లో రిలీజ్ అవుతుంది.

ఈ సినిమా విషయంలో అందరం కూడా చాలా ఎగ్జైటెడ్ గా .. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాము. మీ అందరికీ కూడా ఈ సినిమా నచ్చుతుందనే నమ్మకంతో ఉన్నాము. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేశారు. వాళ్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సినిమాలో సునీల్ శెట్టిగారు నా కోచ్ గా కనిపిస్తారు. నా కోచ్ ఇంత ఫిట్ గా ఉంటే నేనెంత ఫిట్ గా ఉండాలి అనుకుని .. రోజూ జిమ్ కి వెళ్లడం మొదలుపెట్టాను. ఇక ఈ సినిమాలో ఒక పాత్రను గురించి కిరణ్ చెప్పేటప్పుడు నాకు ఉపేంద్ర గారు తప్ప ఎవరూ కనిపించ లేదు.

కన్నడలో ఉపేంద్రగారు సూపర్ స్టార్ .. ఆయన ఈ సినిమాలో ఈ పాత్ర చేస్తారా? అని కిరణ్ ను అడిగాను. అప్పుడు కిరణ్ 'నేను వెళ్లి ఆయన కాళ్లపై పడైనా ఆయనను ఒప్పించుకుని వస్తాను' అని చెప్పేసి వెళ్లాడు. ఆయన ఈ సినిమాలో నటించడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాను. అందరూ కూడా ఈ సినిమాలో ఒక డిఫరెంట్ ఉపేంద్రగారిని చూడబోతున్నారు. ఆ పాత్రను ఆయన తప్ప మరెవరూ అలా చేయలేరు. నవీన్ కూడా ఈ సినిమాలో తనకి ఇచ్చిన పాత్రను చాలా కసిగా చేశాడు.

రామజోగయ్య శాస్త్రిగారి పాటలు .. అబ్బూరి రవిగా రి మాటలు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి. తమన్ ఈ సినిమాకి గొప్ప సంగీతాన్ని అందించాడు. థియేటర్లో స్పీకర్లు పగిలిపోవడం ఖాయం. ఈ సినిమాకి ఆయన బ్యాక్ బోన్ అని చెప్పచ్చు.

ఇక నిర్మాతలిద్దరూ ఒక ఫ్యాషన్ తో ఇండస్ట్రీకి వచ్చారు. ఈ సినిమా కోసం వాళ్లు నేను అనుకున్నదానికంటే ఎక్కువ కష్టపడ్డారు. తప్పకుండా వాళ్లు సక్సెస్ అవుతారనే నమ్మకం నాకు ఉంది. ఇండస్ట్రీకి ఇలాంటి యువ నిర్మాతలు ఎంతోమంది రావాలి. ఇక ఈ సినిమాకి ఒక నీడలా అరవింద్ గారు ఉంటూ వచ్చారు.

కల్యాణ్ బాబాయ్ చేసిన 'తమ్ముడు' సినిమా ప్రభావం నాపై ఎప్పటి నుంచో ఉంది. ఆ సినిమా చూసినప్పుడు నేను హీరోను అవుతానని కూడా నాకు తెలియదు. బాబాయ్ ట్రెండ్ సెట్ చేశాడు .. మేము ఫాలో కావడానికి ట్రై చేస్తున్నాము అంతే. మేమంతా కూడా ఎంతో కష్టపడి .. ఇష్టపడి ఈ సినిమా చేశాము. నాకు నమ్మకం లేకపోతే నేను చెప్పను. ఈ సినిమా గట్టిగానే కొడుతుందనే నమ్మకం నాకు ఉంది. మీ అందరికీ ఈ సినిమా తప్పకుండా నచ్చుతుందనే అనుకుంటున్నాను" అని చెప్పుకొచ్చాడు.