Begin typing your search above and press return to search.

పవన్-దాసరి సినిమా పోయినట్లే

By:  Tupaki Desk   |   4 Feb 2016 9:30 AM GMT
పవన్-దాసరి సినిమా పోయినట్లే
X
దాసరి నారాయణరావు నిర్మాణంలో పవన్ కళ్యాణ్ సినిమా.. ఈ ప్రకటన బయటికి వచ్చి చాలా కాలమవుతోంది. కానీ ఇప్పటిదాకా ఉలుకూ పలుకూ లేదు. అసలు ఈ ప్రకటన వచ్చిన రోజే చాలా సందేహాలు కలిగాయి. నిజంగా ఇది సాధ్యమేనా అని. ఎందుకంటే ఈ ఈక్వేషన్ అంత ఈజీగా తేలేది కాదని అందరికీ తెలుసు. అయినప్పటికీ దాసరి అడపా దడపా ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూనే ఉండేసరికి ఎప్పుడో ఒకప్పుడు సినిమా పట్టాలెక్కేస్తుందేమో అన్న అనుమానాలు కూడా కలిగాయి. కిషోర్ పార్థసాని (డాలీ) ఈ కాంబినేషన్లో సినిమాకు స్క్రిప్టు రెడీ చేస్తున్నట్లు కూడా వార్తలొచ్చాయి. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ తర్వాత పట్టాలెక్కబోయేది ఆ సినిమానే అని ఆ మధ్య గట్టి ప్రచారం కూడా జరిగింది.

కానీ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తీరు చూస్తుంటే దాసరి సినిమాను అటకెక్కించేసినట్లే కనిపిస్తోంది. ఎందుకంటే ‘సర్దార్..’ తర్వాత రెండు ప్రాజెక్టులు లైన్ లో పెట్టేశాడు పవన్. ఈ రెండింట్లో ఏదీ దాసరి బేనర్ లో కాదని స్పష్టమైపోయింది. కాబట్టి దాసరికి పవన్ టాటా చెప్పేసినట్లే అనుకోవాలి. దాసరిని కలిసి సినిమా అనౌన్స్ చేసేనాటి పరిస్థితులకు, ఇప్పటి పరిస్థితులకు పోలిక లేదు. అప్పట్లో అన్నయ్య చిరంజీవికి దూరంగా ఉండేవాడు పవన్. కానీ ఇప్పుడు మెగా బ్రదర్ తో క్లోజ్ అయిపోతున్నాడు. మరోవైపు దాసరి జగన్ ను కలవడం ద్వారా పవన్ కు దూరమైపోయాడు. ఈ పరిస్థితుల్లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా అన్నది కలగానే మిగిలిపోయేలా కనిపిస్తోంది.