Begin typing your search above and press return to search.

పవన్.. ఆ ఒక్కటీ అడక్కు

By:  Tupaki Desk   |   29 July 2015 3:44 PM IST
పవన్.. ఆ ఒక్కటీ అడక్కు
X
ఓ సినిమా షూటింగ్ పూర్తయ్యాక ఏళ్ల తరబడి విడుదల ఆగిపోవడం చూశాం కానీ.. షూటింగ్ మొదలవడం కోసం ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సి రావడం ఒక్క సర్దార్ గా మారబడిన గబ్బర్ సింగ్-2 సినిమా విషయంలో మాత్రమే జరిగింది. ఎప్పుడో మూడేళ్ల కిందట ఈ ప్రాజెక్టు ఓకే అయింది. కానీ ఈ మూడేళ్లలో ఎంత సస్పెన్స్ నడిచిందో.. ఎన్ని మార్పులు చోటు చేసుకున్నాయో అందరికీ తెలిసిందే. మహారాష్ట్రలో రెండు నెలల కిందట వారం పది రోజులు షూటింగ్ జరిగినా.. అందులో పవన్ కళ్యాణ్ లేకపోవడంతో మళ్లీ సినిమా మీద సందేహాలు నెలకొన్నాయి. ఐతే ఎట్టకేలకు పవన్ కూడా సినిమా కోసం రెడీ అయిపోయాడు. బుధవారం హైదరాబాద్ పరిసరాల్లో షూటింగ్ మొదలైపోతున్నట్లు సమాచారం బయటికి వచ్చింది.

ఇంతటితో సస్పెన్స్ కు తెరపడిందనుకుంటే పొరబాటే. సర్దార్ లో హీరోయిన్ ఎవరన్న విషయంలో క్లారిటీ ఇవ్వకుండానే యూనిట్ షూటింగ్ మొదలుపెట్టేస్తోంది. ముందు అనుకున్న అనీషా ఆంబ్రోస్ పై వేటు వేశారా లేదా అన్నది సందేహంగానే ఉంది. పవన్ కు ఎంత నచ్చి ఉన్నా.. ఫొటో షూట్, కొన్ని సన్నివేశాల చిత్రీకరణలో ఏమాత్రం ఆకట్టుకోలేకపోయిందట అనీషా. అభిమానులు కూడా ఆమె విషయంలో చాలా అసంతృప్తితో ఉండటంతో హీరోయిన్ని మార్చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఇంతలో కాజల్ అని.. రకుల్ ప్రీత్ అని చాలా పేర్లు వినిపించాయి. ముంబయి నుంచి మోడళ్లను కూడా దించుతున్నట్లు వార్తలొచ్చాయి. కానీ హీరోయిన్ ఎవరన్నది క్లారిటీ ఇవ్వకుండానే షూటింగ్ అంటున్నారు. బయటికి చెప్పకపోతే పోయారు.. కనీసం వాళ్లకైనా క్లారిటీ ఉంటే చాలు. ఎందుకంటే మళ్లీ దీని కోసం షూటింగ్ ఆపితే కష్టం కదా.