Begin typing your search above and press return to search.

'తెలంగాణ రాబిన్ హుడ్' పాత్రలో పవన్ కళ్యాణ్..?

By:  Tupaki Desk   |   23 April 2021 9:00 PM IST
తెలంగాణ రాబిన్ హుడ్ పాత్రలో పవన్ కళ్యాణ్..?
X
పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న పీరియాడికల్ చిత్రం ''హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు''. ఏఎమ్ రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.దయాకర్ రావు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఇందులో రాబిన్ హుడ్ తరహా పాత్రలో పవన్ కనిపించునున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్ ద్వారా ఈ విషయం స్పష్టమైంది. అయితే ఈ సినిమాలో హీరో పాత్ర తీరుతెన్నులు పాలమూరు పోరాటయోధుడు పండుగ సాయన్న ను పోలి ఉంటాయని ప్రచారం జరుగుతోంది.

మహబూబ్‌ నగర్‌ - పాలమూరుకు చెందిన పోరాట యోధుడు పండుగ సాయన్న 'తెలంగాణ రాబిన్ హుడ్' గా ప్రసిద్ధి చెందారు. సంపన్నులు భూస్వాముల ఇళ్లపై దాడి చేసి గోదాములు పగులగొట్టి ధాన్యం బస్తాలను ఆకలితో అలమటించే పేద ప్రజలకు పంచిపెట్టాడు. ఆధిపత్య వర్గాలచే బందిపోటుగా చిత్రీకరించబడిన సాయన్న, ఒక దళాన్ని ఏర్పాటు చేసుకొని.. పేదవారి కోసం నిలబడ్డాడు. ఇప్పుడు 'వీరమల్లు' చిత్రంలో అలాంటి హీరోయిక్ పాత్రలో పవర్ స్టార్ నటిస్తున్నాడని అంటున్నారు. ఇందులో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.

కాగా, పవన్ కెరీర్ లో వస్తున్న ఫస్ట్ పీరియాడికల్ మూవీ 'వీరమల్లు'. భారీ బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందిస్తున్నారు. ఇందులో పవన్ కు జోడీగా ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ నటిస్తోంది. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా.. హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ బెన్ లాక్ ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేకంగా వేయబడిన సెట్స్ లో షూట్ చేస్తున్నారు. 'హరి హర వీరమల్లు' చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నారు.