Begin typing your search above and press return to search.

పవన్ బర్త్ డే సెలబ్రేషన్స్ లో 'కాపు' సెలబ్రిటీలు..!

By:  Tupaki Desk   |   1 Sept 2021 1:00 PM IST
పవన్ బర్త్ డే సెలబ్రేషన్స్ లో కాపు సెలబ్రిటీలు..!
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 50వ పుట్టిన రోజు వేడుకలకు మరికొన్ని గంటలు సమయం మాత్రమే ఉంది. రేపు (సెప్టెంబర్ 2) గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేయడానికి ఇప్పటికే పీకే అభిమానులు ఏర్పాట్లు చేసుకున్నారు. పవన్ బర్త్ డేను ఈసారి కాపు సంక్షేమ సేన నిర్వహించబోతోంది. ఈ మేరకు మీడియాకు పత్రికా ఆహ్వానం కూడా పంపబడింది. ప్రసాద్ ల్యాబ్స్‌ లో రేపు ఉదయం 9:30 గంటలకు ఈ వేడుకలు జరుగనున్నాయి.

దర్శకుడు మారుతి - ఆర్‌కె నాయుడు ఈ వేడుకలకు హాజరుకానున్నారు. కాపు సంక్షేమ సేన వీరితో పాటుగా పలువురు టాలీవుడ్ ప్రముఖులను కూడా ఆహ్వానించిందని తెలుస్తోంది. వారిలో కొందరు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే పవన్ బర్త్ డే సెలబ్రేషన్స్ ను ఓ సామాజిక వర్గ సంస్థ నిర్వహిస్తుండటం.. దానికి తమ కులానికి చెందిన ప్రముఖులను ఆహ్వానించడం టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది.

కళకు కులం లేదంటూనే టాలీవుడ్ లో చాలామంది సినీ ప్రముఖులు కొన్నేళ్లుగా తమ కులానికి చెందిన సంస్థలకు మద్దతుగా నిలుస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది సెలబ్రిటీలు వారు నిర్వహించే వేడుకల్లో పాల్గొనడానికి వెనుకాడడం లేదు. అయితే మరికొందరు మాత్రం కులం రంగు పొందకుండా వాటికి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు పవన్ బర్త్ డే ఓ వర్గానికి చెందిన వారందని దగ్గర చేయనుంది.

ఇకపోతే పవన్ బర్త్ డే వేడుకలను కాపు సంక్షేమ సేన నిర్వహిస్తే.. రాజకీయాల్లో జనసేనుడికి 'కాపు లీడర్' అనే ట్యాగ్ ని అంటగడతారేమో అని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అంతేకాదు రాబోయే రోజుల్లో టాలీవుడ్ లో కులాల వారీగా హీరోల పుట్టినరోజు వేడుకలు జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు.