Begin typing your search above and press return to search.

పవన్.. మరీ ఇంత లేటా?

By:  Tupaki Desk   |   2 Feb 2017 11:53 AM GMT
పవన్.. మరీ ఇంత లేటా?
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోనే కాదు.. సినిమాల విషయంలోనూ కొంచెం లేటుగానే అంటున్నాడు ఈ మధ్య. ఎప్పుడెప్పుడో ముగిసిపోయిన అధ్యాయాల గురించి పవన్ ఇప్పుడు మాట్లాడుతూ.. తన అభిప్రాయాలు వెల్లడించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి ఈ మధ్య. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఎప్పుడో రెండున్నర నెలల కిందట విడుదలైన సినిమా గురించి ఇప్పుడు స్పందించాడు పవన్. కమెడియన్ టర్న్డ్ హీరో శ్రీనివాసరెడ్డి ప్రధాన పాత్రలో నటించిన ‘జయమ్ము నిశ్చయమ్మురా’ ఎప్పుడో నవంబర్లో రిలీజైంది. విమర్శకుల ప్రశంసలందుకుంది. కలెక్షన్లే ఆశించిన స్థాయిలో రాలేదు.

ఐతే అప్పుడు ఖాళీ లేకపోవడం వల్లో ఏమో.. పవన్ ఈ మధ్యే ఈ సినిమా చూశారు. ఆయనకు నచ్చింది. ఈ సినిమా బాగుందని చెబుతూ.. టీం మొత్తానికి అభినందనలు చెబుతూ.. శ్రీనివాసరెడ్డికి ఒకే బొకే కూడా పంపించాడు పవన్. ట్విట్టర్లో ఈ బొకే ఫొటో షేర్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నాడు శ్రీనివాసరెడ్డి. ఇదేదో సినిమా రిలీజైనపుడే చూసి.. తన అభిప్రాయం చెప్పి ఉంటే అది సినిమా ప్రమోషన్ కు ఉపయోగపడేది. ఏదైతేనేం లేటైనా కూడా పవన్ విషెస్ అంటే ప్రత్యేకమైనవే అనుకుంటోంది ‘జయమ్ము నిశ్చయమ్మురా’ టీం. కొత్త దర్శకుడు శివరాజ్ కనుమూరి స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన ‘జయమ్ము నిశ్చయమ్మురా’ గత ఏడాది వచ్చిన అత్యుత్తమ చిత్రాల్లో ఒకటనడంలో సందేహం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/