Begin typing your search above and press return to search.

పవర్ స్టార్ సినిమాలో కన్నడ సూపర్ స్టార్...?

By:  Tupaki Desk   |   30 Oct 2020 1:30 PM GMT
పవర్ స్టార్ సినిమాలో కన్నడ సూపర్ స్టార్...?
X
పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ దసరా సందర్భంగా మరో న్యూ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. మేకర్స్ అధికారికంగా ప్రకటించినప్పటికీ ఇది మలయాళ సూపర్ హిట్ 'అయ్యప్పనుమ్ కోషియమ్‌' చిత్రానికి రీమేక్ గా తెరకెక్కనుందని తెలుస్తోంది. మలయాళంలో బిజూ మీనన్ పోషించిన సిన్సియర్ పోలీసాఫీసర్ పాత్రలో పవన్ కళ్యాణ్ నటించనున్నాడు. అయితే మలయాళంలో పృథ్వీరాజ్ పోషించిన పాత్రలో ఎవరు నటిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ముందుగా ఈ రోల్ లో దగ్గుబాటి రానా నటించనున్నాడని వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం రానా వేరే సినిమాలకు కమిట్మెంట్స్ ఇచ్చి ఉండటంతో ఈ ప్రాజెక్ట్ కి ఒప్పుకోలేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో ఇద్దరు హీరోల పేర్లు తెరపైకి వచ్చాయి.

పవన్ కళ్యాణ్ పాత్రకి ధీటుగా ఉండే మరో క్యారక్టర్ లో యువ హీరో నితిన్ నటించనున్నాడని పుకార్లు పుట్టుకొచ్చాయి. ఇదే క్రమంలో కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ ని ఈ పాత్ర కోసం పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పవన్ - సుదీప్ కి మంచి అనుబంధమే ఉంది. పవన్ కళ్యాణ్ హిట్ మూవీ 'అత్తారింటికి దారేది' సినిమాని సుదీప్ 'రన్నా' పేరుతో కన్నడలో రీమేక్ చేసి హిట్ కొట్టాడు. ఇటీవలే పవన్ కళ్యాణ్ కార్యాలయంలో ఇద్దరూ సమావేశమై సుమారు గంటసేపు చర్చించుకున్నారు. ఈ నేపథ్యంలో బిజీ షెడ్యూల్ లో కూడా సుదీప్ ఈ సినిమా చేయడానికి అంగీకరించొచ్చు అంటున్నారు.

మరోవైపు పవన్ కళ్యాణ్ కి జోడీగా ఎవరిని తీసుకుంటారనే దానిపై చర్చ జరుగుతోంది. ముందుగా పవన్‌ భార్య పాత్రకి సాయిపల్లవి ని తీసుకోనున్నారని టాక్ నడుస్తోంది. అలానే తెలుగమ్మాయి అంజలి ని కూడా ఈ పాత్ర కోసం సంప్రదిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మరి చివరకు ఈ రీమేక్ లో లీడ్ క్యారెక్టర్స్ కి ఎవరిని ఫైనలైజ్ చేస్తారో చూడాలి. కాగా, ఈ చిత్రానికి థమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ప్రసాద్ మూరెళ్ళ సినిమాటోగ్రఫీ అందించనున్నాడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరిలో స్టార్ట్‌ చేయనున్నారని సమాచారం.