Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్ తో ఊర మాస్ డైరెక్టర్..?

By:  Tupaki Desk   |   30 Dec 2021 7:00 AM IST
పవన్ కళ్యాణ్ తో ఊర మాస్ డైరెక్టర్..?
X
'అజ్ఞాతవాసి' సినిమా తర్వాత పూర్తిగా రాజకీయాల మీద దృష్టి పెట్టిన పవన్ కళ్యాణ్.. కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరమయ్యారు. అయితే వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేసిన 'వకీల్ సాబ్' చిత్రంతో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చారు. కంబ్యాక్ ఇస్తూనే వరుస ప్రాజెక్ట్స్ కు సైన్ చేస్తూ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసారు.

అంతేకాదు కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో చిత్రాన్ని ప్రారంభించి.. ఒకేసారి రెండు సినిమాలకు సంబంధించిన షూటింగులలో పాల్గొన్నారు పవన్. ప్రస్తుతం సాగర్ కె చంద్రతో 'భీమ్లా నాయక్' మరియు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో 'హరి హర వీరమల్లు' వంటి రెండు సినిమా చేస్తున్నారు.

రాబోయే రోజుల్లో హరీష్ శంకర్ తో 'భవదీయుడు భగత్ సింగ్' తోపాటుగా సురేందర్ రెడ్డి చిత్రంలో నటించనున్నారు పవన్. అయితే ఇప్పుడు ఈ దర్శకుల జాబితాలోకి ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను చేరాలని చూస్తున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం టాలీవుడ్ లో కంప్లీట్ మాస్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించగలిగే దర్శకులలో బోయపాటి శ్రీను ఒకరు. అలాంటి కథలతోనే 'భద్ర' 'తులసి' సింహా' 'లెజెండ్' 'సరైనోడు' 'జయజానకి నాయక' వంటి మంచి విజయాలను అందుకున్నారు.

ఇప్పుడు లేటెస్టుగా 'అఖండ' సినిమాతో బోయపాటి మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. నందమూరి బాలకృష్ణను సరికొత్త అవతారంలో ప్రెజెంట్ చేసి.. తనదైన మాస్ యాక్షన్ సీన్స్ తో అదరగొట్టాడు. 'వినయ విధేయరామ' వంటి డిజాస్టర్ తర్వాత మళ్ళీ బాక్సాఫీస్ కు తన సత్తా ఏంటో చూపించారు.

'అఖండ' సక్సెస్ తో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న బోయపాటి శ్రీను.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేయాలని ప్లాన్స్ చేసుకుంటున్నారట. ఇప్పటికే పవన్ కోసం ఓ పవర్ ఫుల్ స్టోరీ కూడా రెడీ చేశారట. అంతేకాదు త్వరలోనే కథ కూడా వినిపించ‌బోతున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

పవన్ కళ్యాణ్ ఇమేజ్ మరియు ఆయన పొలిటికల్ కెరీర్ ని దృష్టిలో పెట్టుకొని బోయపాటి ఓ పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్ కథను సిద్ధం చేశారట. రియల్ లైఫ్ లో జనసేన పార్టీకి నాయకత్వం వహిస్తున్న పవన్.. బోయపాటి స్టోరీలో కూడా ఒక రాజకీయ పార్టీ లీడర్ గా కనిపిస్తారట.

ఇందులో నిజమెంతో తెలియదు కానీ.. పవన్ కళ్యాణ్ - బోయపాటి శ్రీను వంటి ఊహించని కాంబినేషల్ లో సినిమా పడితే ఫ్యాన్స్ కి పూనకాలే అని చెప్పవచ్చు. ఇంతవరకు పవన్ పూర్తి స్థాయి మాస్ సినిమా చేయలేదు. మరోవైపు బోయపాటి మాస్ అండ్ యాక్షన్ సినిమాలే చేస్తూ వచ్చారు.

ఒకవేళ ఇప్పుడు వీరిద్దరూ కలిసి సినిమా చేస్తే కనుక ఇదొక క్రేజీ ప్రాజెక్ట్ అవుతుందనడంలో సందేహం లేదు. మరి త్వరలోనే సినీ అభిమానులు ఎక్సపెక్ట్ చేయని ఈ క్రేజీ కాంబోలో సినిమాకు బీజం పడుతుందేమో చూడాలి.

ఇకపోతే 'సరైనోడు' తర్వాత అల్లు అర్జున్ తో బోయపాటి శ్రీను ఓ సినిమా చేయాల్సి ఉంది. 'పుష్ప: ది రైజ్' అనంతరం గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్తుందని అందరూ భావించారు. కానీ ఇప్పుడు 'పుష్ప 2' లైన్ లోకి రావడంతో బోయపాటి కొన్నాళ్ళు వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఈ గ్యాప్ లో మాస్ దర్శకుడు మరో స్టార్ హీరోతో సినిమా చేయాలనే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టారని తెలుస్తోంది.