Begin typing your search above and press return to search.

పవన్ పంచ్: హీరో నానిని తిడుతుంటే బాధేసింది.. అతడేం చేయగలడు?

By:  Tupaki Desk   |   26 Sept 2021 9:33 AM IST
పవన్ పంచ్: హీరో నానిని తిడుతుంటే బాధేసింది.. అతడేం చేయగలడు?
X
టక్ జగదీశ్ విడుదల సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల మీద మీడియాలో భారీ ఎత్తున వార్తలు రావటం తెలిసిందే. ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని థియేటర్ యజమానులు డిమాండ్ చేస్తే.. అందుకు భిన్నంగా ఓటీటీ ఫ్లాట్ ఫాం మీద విడుదల చేసేందుకు వీలుగా చిత్ర నిర్మాతలు నిర్ణయం తీసుకోవటంపై ఆగ్రహం వ్యక్తమైంది. థియేటర్ యజమానులు తీవ్రంగా స్పందించారు. ఈ ఎపిసోడ్ లో హీరో నానిని తప్పు పడుతూ విమర్శలు సంధించారు. దీనిపై ఆయన ఎంత వివరణ ఇచ్చినా ఊరుకోలేదు.

ఒక సినిమాకు హీరోగా ఉంటే పరిమితులు అతనికి ఉంటాయన్న విషయాన్ని మర్చిపోయారు. ఏమనుకున్నా చిత్ర నిర్మాత నిర్ణయమే ఫైనల్ అవుతుంది. అగ్రశ్రేణి హీరోలైతే వేరేలా ఉంటుంది కానీ.. ఒక మోస్తరు హీరో కొన్ని అంశాల్ని మాత్రమే మాట్లాడగలడు. అందునా.. ఆ సినిమాను థియేటర్లలో విడుదల చేయటానికి.. ఏపీలో థియేటర్లు సరిగా ఓపెన్ కాని వేళ.. కరోనా భయంతో ప్రేక్షకులు వస్తారో? రారో? అన్న సందేహాలున్న వేళ..ఊహకు ఏ మాత్రం అందనంత ఫ్యాన్సీ ఆఫర్ వచ్చినప్పుడు ఏ నిర్మాత అయినా తన సినిమాను థియేటర్ కంటే కూడా ఓటీటీలో విడుదల చేసేందుకే ఇష్టపడతారు.

అయితే.. ఈ ఎపిసోడ్ గురించి చిత్ర పరిశ్రమకు చెందిన ఎవరూ మాట్లాడింది లేదు.ఇలాంటి వేళ.. రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ సందర్భంగా పవన్ కల్యాణ్ తన ఘాటు స్పీచ్ లో హీరో నానికి ఎదురైన ఇబ్బందిని ప్రస్తావిస్తూ.. అతనిపై విమర్శలు చేసిన వారిని కడిగిపారేశారు. నానిని తప్పు పట్టిన థియేటర్ యజమానులకు ఆయన ఘాటు పంచ్ వేశారు. నానిని విమర్శించటం కాదు.. వెళ్లి వైసీపీ నేతలతో మాట్లాడుకోవాలన్నారు.

ఈ ఇష్యూ గురించి పవన్ ఏమన్నారంటే.. ''హీరో నాని గురించి తిడుతుంటే బాధ కలిగింది. అక్రమాలు చేయలేదే? హీరోగా ఒక సినిమా చేసుకొని.. రిలీజ్ చేసే ప్రయత్నం చేశారు. ఓవైపు థియేటర్లు మూసేసిన వేళ.. గత్యంతరం లేక ఓటీటీ ఫ్లాట్ ఫాం మీదకు వెళితే.. థియేటర్ యజమానులంతా ఆ అబ్బాయి మీద పడితే.. ఆ అబ్బాయి ఏం చేస్తాడు? వెళ్లి వైసీపీ నాయకులతో మాట్లాడుకోండి. ఆ అబ్బాయి ఏం చేయగలడు?' అంటూ తన పూర్తి మద్దతును తెలియజేశారు పవన్.