Begin typing your search above and press return to search.

ZEE 5 ఫ్లాట్ ఫామ్ పైకి పవన్ - చరణ్ ప్రాజెక్టులు!

By:  Tupaki Desk   |   15 March 2022 1:30 AM GMT
ZEE 5 ఫ్లాట్ ఫామ్ పైకి పవన్ - చరణ్ ప్రాజెక్టులు!
X
కొంతకాలం క్రితం వరకూ సినిమాలు థియేటర్లకు వచ్చిన తరువాత వాటికి గల రెస్పాన్స్ ను బట్టి శాటిలైట్ బిజినెస్ జరిగేది. ఇక ఇప్పుడు ఓటీటీలు వచ్చిన తరువాత డిజిటల్ రైట్స్ అమ్మకాలకి కూడా ప్రాధాన్యత పెరిగింది. సినిమాకి వచ్చిన టాక్ ను బట్టే ఈ బిజినెస్ కూడా జరిగేది. కానీ ఇప్పుడు ఓటీటీల మధ్య పోటీ పెరిగిపోతోంది. అందువలన కంటెంట్ ఏమిటో ముందుగానే చర్చల ద్వారా తేల్చేసుకుని ఆ ప్రాజెక్టు నిర్మాణంలో భాగమవుతున్నాయి. ఇలా ఒక సినిమా సెట్స్ పైకి వెళ్లే ముందు నుంచే ఆ సినిమాపై హక్కులను పొందేస్తున్నాయి.

ఇలా ఇప్పటికే 'బంగార్రాజు'ను తమ ఫ్లాట్ ఫామ్ పైకి ఎక్కించేసిన ZEE 5, పవన్ - చరణ్ తాజా సినిమాల విషయంలోను ఇదే పద్ధతిని అనుసరిస్తుందని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ తన తాజా చిత్రమైన 'హరిహర వీరమల్లు' సినిమాపై దృష్టిపెట్టారు.

క్రిష్ దర్శకత్వంలో ఇప్పటికే ఈ సినిమా 50 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. త్వరలోనే మిగతా షూటింగు కోసం మళ్లీ సెట్స్ పైకి వెళ్లనున్నారు. ఆ తరువాత హరీశ్ శంకర్ సినిమా 'భవదీయుడు భగత్ సింగ్' సినిమా చేయనున్నారు. ఆ వెంటనే లైన్లో సురేందర్ రెడ్డి ఉన్నాడు.

ఇక ఈ ప్రాజెక్టుల మధ్యలో పవన్ ఒక డిఫరెంట్ మూవీ చేయనున్నారు .. అదీ సముద్రఖని దర్శకత్వంలో. తమిళంలో ఆయన దర్శకత్వంలో క్రితం ఏడాది అక్టోబర్లో 'వినోదయా సితం' అనే సినిమా వచ్చింది. బడ్జెట్ పరంగా చిన్న సినిమానే అయినా, పూర్తి వినోదభరితమైన కథ ఇది. ఒక సామాన్యుడి జీవితంతో ముడిపడి నడిచే ఫాంటసీ సినిమా ఇది. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీవారు రీమేక్ చేస్తుండగా, డిజిటల్ హక్కులను ZEE 5వారు తీసుకున్నట్టుగా సమాచారం. ఇక చరణ్ సినిమా కూడా వారి చేతికే వెళ్లినట్టుగా తెలుస్తోంది.

చరణ్ హీరోగా శంకర్ ఒక భారీ బడ్జెట్ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది. ఆల్రెడీ కొన్ని యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించారు. ఈ సినిమాలో చరణ్ సరసన నాయికగా కియారా కనువిందు చేయనుంది. 'వినయ విధేయ రామ' తరువాత చరణ్ తో ఆమె చేస్తున్న సినిమా ఇది.

తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. దిల్ రాజు బ్యానర్ పై వస్తున్న 50వ సినిమా ఇది. దిల్ రాజు బ్యానర్ కి గల గుడ్ విల్ ను ఉపయోగించుకుంటూ, ఈ సినిమాను ZEE 5 వారే నిర్మిస్తున్నారనే టాక్ కూడా ఒక వైపున నడుస్తూనే ఉంది. మొత్తానికి రెండు క్రేజీ ప్రాజెక్టులు ZEE 5 ఖాతాలోకి వెళ్లిపోయాయన్నమాట.