Begin typing your search above and press return to search.

'ప్రాజెక్ట్ K' కోసం బరిలోకి బాలీవుడ్ ఫైట్ మాస్టర్!

By:  Tupaki Desk   |   21 Feb 2022 11:30 AM GMT
ప్రాజెక్ట్ K కోసం బరిలోకి బాలీవుడ్ ఫైట్ మాస్టర్!
X
ప్రభాస్ ఇప్పుడు వరుస పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'రాధే శ్యామ్' త్వరలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ప్రమోషన్స్ ను మొదలుపెట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. రొమాంటిక్ హీరోగా ప్రభాస్ ను చూడటానికి అభిమానులంతా ఎంతో ఆసక్తితో .. ఉత్సాహంతో ఉన్నారు. ఆ తరువాత సినిమాలుగా 'సలార్' .. 'ఆది పురుష్' ఆయన నుంచి రానున్నాయి. పౌరాణిక చిత్రమైన 'ఆది పురుష్'మును ఇటీవల పూర్తిచేసిన ఆయన, 'సలార్'ను కూడా ముగింపు దశకి తీసుకుని వచ్చేశాడు.

ఇక ఆ తరువాత సినిమా అయిన 'ప్రాజెక్టు K'ను కూడా ఆయన పట్టాలెక్కించాడు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా రెండు .. మూడు షెడ్యూల్స్ ను పూర్తిచేసుకుంది. ఆల్రెడీ ఈ సినిమా షూటింగులో అమితాబ్ .. దీపిక పదుకొనే కూడా పాల్గొన్నారు.

ఇది సైన్స్ ఫిక్షన్ జోనర్లో సాగే కథ. ప్రభాస్ ఈ సినిమాలో సూపర్ హీరోగా కనిపించనున్నాడు. ఈ విషయం బయటికి వచ్చిన దగ్గర నుంచి ఆయన అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగిపోతోంది.

ప్రభాస్ సినిమా అంటేనే ఆయన సినిమాల్లో యాక్షన్ సీన్స్ ఇక రేంజ్ లో ఉండాలని అభిమానులు కోరుకుంటారు. అలాంటిది సూపర్ హీరోగా ఆయన కనిపించే ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ ఏ స్థాయిలో ఉండాలని కోరుకుంటారనేది ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. వాళ్ల అంచనాలకి తగినట్టుగానే ఈ సినిమా యాక్షన్ సీన్స్ ఉండేలా చూస్తున్నారట. ఒక స్పెషల్ యాక్షన్ బ్లాక్ కోసం బాలీవుడ్ ఫేమస్ యాక్షన్ కొరియో గ్రాఫర్ పర్వేజ్ షేక్ ను రంగంలోకి దింపినట్టుగా చెబుతున్నారు.

త్వరలో థియేటర్లకు రానున్న 'బ్రహ్మాస్త్ర' మొదలు అనేక బాలీవుడ్ సినిమాలకి ఆయన యాక్షన్ కొరియోగ్రఫర్ గా పనిచేశారు. ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలకి .. భారీ బడ్జెట్ తో కూడిన యాక్షన్ సినిమాలకి పనిచేసిన సుదీర్ఘమైన అనుభవం ఆయన సొంతం.

అలాంటి ఆయన కంపోజ్ చేసే ఫైట్స్ చూస్తే గూస్ బంప్స్ రావడం ఖాయం. ఆ స్థాయిలోనే ఈ సినిమా కోసం ఆయన ఒక యాక్షన్ బ్లాక్ ను రెడీ చేసినట్టు చెబుతున్నారు. ఈ యాక్షన్ బ్లాక్ ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. ఇది పాన్ వరల్డ్ సినిమా అని నాగ్ అశ్విన్ చెబుతుండటం ఈ సినిమాపై అందరిలో మరింత ఆత్రుత .. ఆసక్తిని పెంచుతున్నాయి.