Begin typing your search above and press return to search.

అన్నగారి చివరి డైలాగులు రాసినందుకు బాధగా ఉంది!

By:  Tupaki Desk   |   18 Aug 2022 6:00 AM IST
అన్నగారి చివరి డైలాగులు రాసినందుకు బాధగా ఉంది!
X
పరుచూరి బ్రదర్స్ అనే మాటను ముందుగా వాడినదే ఎన్టీ రామారావు. ఆయన పట్ల తమకి గల అభిమానాన్నీ .. అనుబంధాన్ని గురించి పరుచూరి గోపాలకృష్ణ తరచూ ప్రస్తావిస్తూనే ఉంటారు. ఆయనతో కలిసి పనిచేసిన సినిమాలు .. చిత్రీకరణ సమయంలో జరిగిన సంఘటనలను ఆయన అభిమానులతో పంచుకుంటూనే ఉంటారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో, 'మేజర్ చంద్రకాంత్' సినిమాకి సంబంధించిన విశేషాలను గురించి 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో ప్రస్తావించారు.

'మేజర్ చంద్రకాంత్' సినిమాకి సంబంధించి అన్నగారిపై పబ్లిక్ లో ఒక సీన్ తీయవలసి వచ్చింది. ఆ సీన్ ను మీరు తీయండి .. అంటూ రాఘవేంద్రరావు గారు వెళ్లిపోయారు. అన్నగారికి యాక్షన్ చెప్పాలంటే నాకు కాళ్లు వణుకుతున్నాయి.

ఆయన సీన్ ను డైరెక్ట్ చేసే ఒక అదృష్టాన్ని నాకు కలిగించారు. ఇప్పటికీ ఆ సన్నివేశం నాకు గుర్తొస్తూ ఉంటుంది. ఆ సన్నివేశాన్ని తెరపై చూస్తుంటే ఇప్పటికీ కూడా రోమాలు నిక్కబొడుస్తాయి. అన్నగారు అంత అద్భుతంగా నటించారు. ఆ వయసులో ఆయన నటన చూసి మతిపోయింది.

'మేజర్ చంద్రకాంత్' కథను అన్నగారు పూర్తిగా వినలేదు. అందువలన ఆయన ఎప్పుడు ఏం అడుగుతారా అని మేము టెన్షన్ పడేవాళ్లం. కానీ ఆయన ఎప్పుడూ ఏమీ అడగలేదు. సీన్ చెబుతుంటే .. "ఒకసారి మీ డిక్షన్ లో చందవండి .. మీ హృదయం ఏమిటో అర్థమవుతుంది" అనేవారు.

అసెంబ్లీ ఎదురుగా సీన్ తీసుకున్నప్పుడు మాత్రం, "డైలాగ్స్ బాగున్నాయ్ .. ఇంకో రెండు మూడు పేజీలు రాయొచ్చు గదా" అన్నారు. ఆల్రెడీ జనాలు మీ ఉపన్యాసాలు వినేసి ఉన్నారు. అందువలన ఇక్కడ ఏం జరగనుందనే విషయంపైనే వాళ్లు దృష్టి పెడతారని అంటే 'అవును మీరు చెప్పింది నిజమే' అన్నారు.

'మేజర్ చంద్రకాంత్' అన్నగారు నటించిన ఆఖరి సినిమా కావడం వలన, ఆయన చెప్పిన చివరి డైలాగులు మన కలమే రాసిందా అనే ఒక రకమైన బాధ ఉంది. మన డైలాగులు ఆయన చెప్పారు అనే ఒక రకమైన గౌరవం ఉంది. ఈ సినిమా డబ్బింగ్ సమయంలో ఆయన వెనక నుంచి వచ్చి నన్ను గట్టిగా పట్టుకున్నారు. 'నా అభిమానులు మిమ్మల్ని జీవితంలో మరిచిపోలేరు' అని అన్నారు. ఆ సంఘటనను నేను ఎప్పటికీ మరిచిపోలేను. వెయ్యేళ్ల పాటు ఆయన తెలుగు జాతి గుండెల్లో ఉండిపోవాలని కోరుకుంటున్నాను" అంటూ చెప్పుకొచ్చారు.