Begin typing your search above and press return to search.

చిరు-చరణ్.. మగధీర-2

By:  Tupaki Desk   |   11 Sep 2017 8:21 AM GMT
చిరు-చరణ్.. మగధీర-2
X
రామ్ చరణ్ కెరీర్లో మరపురాని.. ఎప్పటికీ నిలిచిపోయే సినిమా ‘మగధీర’. మళ్లీ చరణ్ కెరీర్లో కొత్తగా అలాంటి ఓ సినిమా వస్తుందా అంటే.. సందేహమే. మరి ‘మగధీర’కు సీక్వెల్ తీస్తే ఎలా ఉంటుంది..? ఈ ఆలోచననే లేవనెత్తారు సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ‘శ్రీవల్లీ’ ప్రి రిలీజ్ ఈవెంట్లో. ఈ వేడుకకు చరణ్ ముఖ్య అతిథిగా హాజరైన నేపథ్యంలో అతడిని.. విజయేంద్ర ప్రసాద్ ను ఉద్దేశించి పరుచూరి మాట్లాడాడు. చరణ్ తో ‘మగధీర’ లాంటి మరపురాని సినిమా తీశారు. మరి ‘మగధీర-2’ చేయాల్సి వస్తే చరణ్ తోనే చేస్తారా.. ఈ మధ్యే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవితో చేస్తారా అంటూ విజయేంద్రను ఇరకాటంలో పెట్టారు పరుచూరి.

ఈ ప్రశ్నకు విజయేంద్ర ప్రసాద్ తెలివిగా సమాధానం చెప్పారు. మీ కలం బలం తోడైతే.. చిరు-చరణ్ ఇద్దరినీ పెట్టి ‘మగధీర-2’ తీస్తాం అని విజయేంద్ర చెప్పారు. పరుచూరి-విజయేంద్ర ఒకప్పుడు కలిసి పని చేశారు. వీళ్ల కలయికలో ‘బొబ్బిలి సింహం’.. ‘సమరసింహారెడ్డి’ లాంటి సినిమాలు రావడం విశేషం. ఈ నేపథ్యంలోనే విజయేంద్రను పొగిడేందుకు పరుచూరి ఏం సంకోచించలేదు. ఇండియాలో 2 వేల కోట్ల రూపాయల సినిమాకు కథ అందించిన రచయిత విజయేంద్ర ప్రసాద్ అని.. ఆయన్నుంచి ఇలాంటి భారీ కథలతో పాటు ‘ఈగ’ లాంటి ప్రయోగాత్మక సినిమా కూడా వచ్చిందని.. ఈ కోవలోనే ‘శ్రీవల్లీ’ కూడా మంచి ప్రయోగం అవుతుందని పరుచూరి అన్నారు. తర్వాత మైకు అందుకున్న విజయేంద్ర.. తాను ‘మగధీర’.. ‘బాహుబలి’ లాంటి సినిమాలకు రాయగలిగినా.. ‘ఖైదీ’.. ‘ఖైదీ నంబర్ 150’ లాంటి సినిమాలకు మాత్రం రాయలేనని.. అది పరుచూరి సోదరులకు మాత్రమే సాధ్యమని అన్నారు.