Begin typing your search above and press return to search.

అప్పుడు విజయశాంతి చిన్న పిల్లలా ఏడ్చేసింది

By:  Tupaki Desk   |   16 Oct 2019 9:03 AM GMT
అప్పుడు విజయశాంతి చిన్న పిల్లలా ఏడ్చేసింది
X
లేడీ సూపర్‌ స్టార్‌ గా.. లేడీ అమితాబ్‌ గా గుర్తింపు దక్కించుకున్న విజయశాంతి అప్పట్లో స్టార్‌ హీరోలకు ధీటుగా సినిమాలు చేసేది. స్టార్‌ హీరోలతో ఈమె చేసిన సినిమాలు మాత్రమే కాకుండా.. ఈమె చేసిన హీరోయిన్‌ ప్రధానమైన చిత్రాలు కూడా సూపర్‌ హిట్‌ అయ్యాయి. 13 ఏళ్ల క్రితం విజయశాంతి సినిమాలకు దూరం అయ్యింది. అప్పటి నుండి పూర్తిగా రాజకీయాల్లోనే ఉంటూ వచ్చింది. పార్లమెంటు సభ్యురాలిగా ఇంకా పలు పార్టీ పదవులను నిర్వహించిన విజయశాంతి మళ్లీ 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తోంది.

విజయశాంతితో సరిలేరు నీకెవ్వరు చిత్రంలో పరుచూరి గోపాలకృష్ణ కొన్ని సీన్స్‌ చేశాడట. ఇటీవలే ఆ సీన్స్‌ కు సంబంధించిన చిత్రీకరణ పూర్తి చేశారు. ఈ సందర్బంగా ఆయన పరుచూరి పలుకులు కార్యక్రమంలో విజయశాంతితో ఉన్న అనుబంధం గురించి.. ఆమె సరిలేరు నీకెవ్వరు చిత్రం నటిస్తున్న తీరు గురించి మాట్లాడాడు. సరిలేరు నీకెవ్వరు షూటింగ్‌ బ్రేక్‌ సమయంలో అంతా కార్‌ వ్యాన్‌ లో ఉంటే ఆమె మాత్రం ఒక చెట్టు కింద కూర్చుని ఉన్నారు. ఆమె నన్ను అక్కడకు పిలవడంతో నేను వెళ్లాను. ఆ సమయంలో పాత జ్ఞాపకాలను చాలా నెమరవేసుకున్నామని పరుచూరి అన్నారు.

విజయశాంతి గురించిన ఒక పాత జ్ఞాపకాన్ని పరుచూరి ఈ సందర్బంగా పంచుకున్నారు. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన అపూర్వ సహోదరులు సినిమా షూటింగ్‌ లో విజయశాంతి నటిస్తున్న సమయంలో ఆమె తల్లి గారు చనిపోయారు. ఆ విషయం రాఘవేంద్ర రావు గారు నాకు చెప్పి ఆమెకు విషయం చెప్పకుండా ఆరోగ్యం బాగాలేదని చెప్పి తీసుకు వెళ్లమన్నాడు. నేను నా భర్య కలిసి విజయశాంతిని కారులో ఇంటికి తీసుకు వెళ్లాము. ఇంటికి చేరుకునే వరకు కూడా విజయశాంతి నా భార్య ఒల్లో తల పెట్టి అమ్మకు ఏమైందో అంటూ ఆందోళన చెందుతూనే ఉంది.

ఇంటికి చేరుకున్న తర్వాత విజయశాంతి అక్కడి పరిస్థితి అర్థం చేసుకుని బోరున ఏడ్చేసింది. తల్లి పై పడి చిన్న పిల్లలా విజయశాంతి ఏడవడం అందరిని కదిలించింది. ఆ సమయంలో ఆమెను ఓదార్చడం మా వల్ల కాలేదు. చిన్న పిల్లలా విజయశాంతి ఏడుస్తుంటే అక్కడున్న ఏ ఒక్కరం కూడా ఓదార్చలేక పోయాం అన్నాడు.

సరిలేరు నీకెవ్వరు చిత్రంలో ఆమె పాత్ర గురించి దర్శకుడు చెప్పవద్దన్నాడు, కాని ఒక్కటి మాత్రం ఆ సినిమాలో విజయశాంతి నటన అద్బుతంగా ఉంటుందని.. ఆమె పాత్ర గుర్తుంచుకునేదిగా ఉండి పోతుందని పరుచూరి వారు సినిమాపై అంచనాలు పెంచేశారు.