Begin typing your search above and press return to search.

సినీ ఇండస్ట్రీని కలవరపెడుతున్న కరోనా స్ట్రెయిన్..!

By:  Tupaki Desk   |   23 Dec 2020 2:30 PM GMT
సినీ ఇండస్ట్రీని కలవరపెడుతున్న కరోనా స్ట్రెయిన్..!
X
కంటికి కనిపించని మహమ్మారి కరోనా వైరస్ ఏడాదిగా ప్రపంచ వ్యాప్తంగా మానవాళిని ముప్పుతిప్పలు పెడుతోంది. ఇంకా కరోనా భయం వీడనప్పటికీ కేసులు తగ్గుముఖం పట్టడం.. కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో అందరూ తగు జాగ్రత్తలతో జీవనం సాగిస్తున్నారు. ఇక కోవిడ్-19 కారణంగా తీవ్రంగా నష్టపోయిన సినీ ఇండస్ట్రీలో కూడా ఇప్పుడిప్పుడే సాదారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. సినిమా షూటింగ్స్ తిరిగి ప్రారంభమవడంతో పాటు సినిమా థియేటర్స్ కూడా రీ ఓపెన్ చేస్తున్నారు. జనాలు థియేటర్లకు వస్తారా రారా అనే అనుమానాలు పక్కనపెట్టి 50 శాతం సీటింగ్ కెపాసిటీతో సినిమాలు రిలీజ్ చేయడానికి మేకర్స్ ముందుకొస్తున్నారు. క్రిస్మస్ నుంచి సినిమా పండుగ మొదలు పెట్టడానికి నిర్ణయించుకున్నారు. దీనికి తగ్గట్టు కొన్ని సినిమాలు విడుదల తేదీలను కూడా ప్రకటించారు. అంతా బాగుందనుకుంటున్న వేళ ఇప్పుడు కొత్త రకం కరోనా అనే వార్త సినీ ఇండస్ట్రీపై పిడుగులా పడబోతోంది.

బ్రిటన్‌ లో వెలుగుచూసిన ఈ రెండో రకం కరోనా స్ట్రెయిన్‌ తో జనాలు మరింత కలవరపడుతున్నారు. దక్షిణాఫ్రికా, యూకే వంటి దేశాల నుంచి ఈ భయం పొంచి ఉందని తెలుస్తోంది. దీంతో అమెరికాతో పాటు మన దేశం కూడా అప్రమత్తమవుతోంది. దేశంలోకి విదేశాల నుంచి విమాన రాకపోకలు రద్దు చేసారు. మహారాష్ట్రలో ఇప్పటికే రాత్రివేళ కర్వ్యూ అమలు పరుస్తున్నారు. కర్ణాటక - తెలంగాణ రాష్ట్రాలు కూడా దీనిపై అప్రమత్తం అయ్యారని తెలుస్తోంది. అయితే ఇటీవల బ్రిటన్ నుంచి భారత్‌ కు వచ్చిన 25 మందికి కోవిడ్-19 పాజిటివ్‌ గా నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఇప్పుడు మళ్లీ సినీ ఇండస్ట్రీ ఇబ్బందుల్లో పడుతుందేమో అని అందరూ భయపడుతున్నారు.

ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిన సినిమా వాళ్లకు ఇప్పుడు షూటింగ్స్ పూర్తి చేసుకున్న చిత్రాలు థియేటర్స్ లోకి వస్తేనే ఆదాయం చేకూరే అవకాశం ఉంది. అందుకే ఫిలిం మేకర్స్ థియేట్రికల్ రిలేజ్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు కరోనా స్ట్రెయిన్ వల్ల మళ్ళీ పరిస్థితులు చేయిదాటిపోయి మరోసారి లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తే ఏమి చేయాలని అందరూ ఆందోళన చెందుతున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో థియేటర్లు తెరిచి మళ్లీ మూసేయాలా.. లేక వేచి చూసే ధోరణి అవలంభించాలా అని యాజమాన్యాలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడిప్పుడే సినిమా షూటింగ్స్ సజావుగా జరుగుతూ సినిమా వాళ్లకు పని దొతుకుతోంది. కరోనా స్ట్రెయిన్ వల్ల మళ్ళీ షూటింగ్స్ నిలిపివేసే పరిస్థితి వస్తుందేమో అని భయపడుతున్నారట. ఇదే కనుక జరిగితే చిత్ర పరిశ్రమ మరోసారి తీవ్ర నష్టాలను చూస్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.