Begin typing your search above and press return to search.

'సర్కారు వారి పాట' 'ఫైటర్' చిత్రాలకు కరోనా స్ట్రెయిన్ అడ్డంకిగా మారనుందా..?

By:  Tupaki Desk   |   22 Dec 2020 12:42 PM GMT
సర్కారు వారి పాట ఫైటర్ చిత్రాలకు కరోనా స్ట్రెయిన్ అడ్డంకిగా మారనుందా..?
X
ప్రపంచాన్ని ఇంకా కరోనా భయం వీడనప్పటికీ అందరూ తగు జాగ్రత్తలు రోజువారీ జీవనం సాగిస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో కూడా సాదారణ పరిస్థితులు తీసుకురాడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడిప్పుడే సినిమా షూటింగ్స్ తిరిగి స్టార్ట్ అవడంతో పాటు సినిమా థియేటర్స్ కూడా రీ ఓపెన్ అవుతున్నాయి. ఇక విదేశాలలో షూటింగ్స్ ప్లాన్ చేసుకున్న కొన్ని సినిమాలు కోవిడ్ నేపథ్యంలో లేట్ అవుతూ వచ్చాయి. వాటిలో ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు 'సర్కారు వారి పాట'.. పూరీ జగన్నాథ్ - విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న 'ఫైటర్' చిత్రాలను చెప్పుకోవచ్చు.

పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'సర్కారు వారి పాట' బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని విదేశాలకు పారిపోతోన్న ఆర్థిక నేరగాళ్లను, బ్యాంకు స్కాముల నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది. దీని కోసం అమెరికాలో ఓ షెడ్యూల్ ప్లాన్ చేసుకోగా కరోనా కారణంగా బ్రేక్ పడింది. దీంతో హైదరాబాద్ లోనే చిత్రీకరణ ప్రారంభించాలని రామోజీ ఫిలిం సిటీలో ఓ బ్యాంక్ సెట్ నిర్మాణం చేపడుతున్నారని వార్తలు వచ్చాయి. అదే సమయంలో ఒరిజినాలిటీ కోసం రియల్ బ్యాంక్ లోనే షూట్ చేయాలని భావించిన మేకర్స్ చికాగోలోని ఓ బ్యాంక్ నుంచి అనుమతుల కోసం ట్రై చేస్తున్నారట. పర్మిషన్ వస్తే జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకున్నారు.

అలానే పూరీ - విజయ్ దేవరకొండ చిత్రాన్ని కూడా విదేశాల్లో ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికే ముంబైలో ఓ షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి కరోనా బ్రేక్స్ వేసింది. కథ రీత్యా అమెరికాలో ఎక్కువ శాతం విదేశీ నటీనటులతో వర్క్ చేయాల్సి ఉందట. అయితే కోవిడ్ టైంలో విదేశాలలో షూటింగ్ చేసే పరిస్థితులు లేకపోవడం.. అమెరికా వెళ్లే ఛాన్స్ లేకుండా పోయింది. అయితే జనవరి కి అన్నీ సెట్ అవుతాయని.. అప్పుడు అమెరికా లో షూట్ చేసుకోవచ్చని మేకర్స్ భావించారట. అయితే ఇప్పుడు కరోనా స్ట్రెయిన్ వైరస్ కారణంగానే 'సర్కారు వారి పాట' మరియు 'ఫైటర్' సినిమాల షూటింగ్ ప్రశ్నార్థకంగా మారిందని అంటున్నారు.

కరోనా వైరస్ కరోనా స్ట్రెయిన్ గా రూపు మార్చుకుని మళ్ళీ మానవాళిని భయబ్రాంతులకు గురి చేస్తోంది. ముఖ్యంగా దక్షిణాఫ్రికా, యూకే నుంచి ఈ భయం పొంచి ఉంది. అమెరికా తో పాటు మన దేశం కూడా అప్రమత్తమవుతోంది. దేశంలోకి విదేశాల నుంచి విమాన రాకపోకలు రద్దు చేసారు. ఇలాంటి నేపథ్యంలో విదేశాల్లో షూటింగ్ అంటే అది జరిగే పని కాదు. ఇక 'ఫైటర్' చిత్రాన్ని ముంబైలో చిత్రీకరించాడని మహారాష్ట్రలో ఇప్పటికే రాత్రివేళ కర్వ్యూ అమలు పరుస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే 'ఫైటర్' మరియు 'సర్కారు వారి పాట' వంటి విదేశాలలో షూటింగ్ ప్లాన్ చేసుకున్న సినిమాలు సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయని చెప్పవచ్చు.