Begin typing your search above and press return to search.

నో బ్రేక్స్ అంటున్న పాన్ ఇండియా స్టార్‌

By:  Tupaki Desk   |   26 Aug 2022 5:30 PM GMT
నో బ్రేక్స్ అంటున్న పాన్ ఇండియా స్టార్‌
X
యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ మునుపెన్న‌డూ లేనంత‌గా బ్యాక్ టు బ్యాక్ భారీ సినిమాల్లో న‌టిస్తూ బిజీ బిజీగా గ‌డిపేస్తున్నారు. ప్ర‌స్తుతం రెండు క్రేజీ ప్రాజెక్ట్ ల‌లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ తో క‌లిసి తొలి బాలీవుడ్ మూవీగా 'ఆది పురుష్‌'లో న‌టిస్తున్న ప్ర‌భాస్ ఈ మూవీ షూటింగ్ ని పూర్తి చేసి ప్ర‌స్తుతం త‌న దృష్టి అంతా రెండు ప్రాజెక్ట్ ల‌పై పెట్టాడు. 'కేజీఎఫ్‌' సిరీస్ చిత్రాల‌తో ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నాలు సృష్టించిన ప్ర‌శాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న 'స‌లార్‌'లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

ఈ మూవీ షూటింగ్ ద‌శ‌లో వుంది. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన షూటింగ్ తో 50 శాతం పూర్తి అయింద‌ని తెలిసింది. శృతిహాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీలోని కీల‌క పాత్ర‌లో మ‌ల‌యాళ హీరో పృథ్వీరాజ్ సుకుమార‌న్ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

ప్ర‌శాంత్ నీల్ యూనివ‌ర్స్ లో భాగంగా తెర‌కెక్కుతున్నఈ సినిమాకు య‌ష్ 'కేజీఎఫ్' సామ్రాజ్యానికి సంబంధం వుంటుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇదిలా వుంటే ఈ మూవీతో పాటు నాగ్ అశ్విన్ అత్యంత భారీ స్థాయిలో రూపొందిస్తున్న టైమ్ ట్రావెల్ సైన్స్ ఫిక్ష‌న్ 'ప్రాజెక్ట్ కె' లో ప్ర‌భాస్ న‌టిస్తున్నాడు.

ఈ రెండు సినిమాలు సెట్స్ పై వుండ‌గానే మారుతి సినిమాని కూడా సైమ‌ల్ టేనియ‌స్ గా పూర్తి చేయ‌ల‌న్న‌ది ప్ర‌భాస్ ప్లాన్ గా తెలుస్తోంది. ఆగ‌స్టు 25న లాంఛ‌నంగా పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకున్న ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్ పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్ నిర్మించ‌బోతున్నారు.

డీవీవీ దాన‌య్య .. ద‌ర్శ‌కుడు మారుతి కార‌ణంగా త‌ప్పుకోవ‌డంతో టి.జి. విశ్వ‌ప్ర‌సాద్ ఈ మూవీని నిర్మిస్తున్నార‌ని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలా వుంటే ఈ మూడు ప్రాజెక్ట్ ల‌ని ఒకేసారి పూర్తి చేయాల‌ని మారుతి మూవీకి ప్ర‌భాస్ డేట్స్ స‌ర్దుబాటు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. స‌లార్‌, ప్రాజెక్ట్ కె షూటింగ్ ల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కుండా మారుతి ప్రాజెక్ట్ కి ప్ర‌భాస్ డేట్స్ కేటాయించ‌బోతున్నార‌ట‌. సూప‌ర్ నేచుర‌ల్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్క‌నున్న ఈ మూవీకి 'రాజాడీల‌క్స్‌' అనే టైటిల్ ని ప‌రిశీలిస్తున్నారు.