Begin typing your search above and press return to search.

ఇతర భాషల్లో సత్తా చాటడానికి రెడీ అయిన టాలీవుడ్ కమెడియన్స్..!

By:  Tupaki Desk   |   8 Aug 2022 5:10 AM GMT
ఇతర భాషల్లో సత్తా చాటడానికి రెడీ అయిన టాలీవుడ్ కమెడియన్స్..!
X
నవ్వడం ఒక భోగం.. నవ్వించడం ఒక యోగం.. నవ్వకపోవడం ఒక రోగం అన్నారో మహాకవి. అయితే నవరసాల్లో హాస్యం పండించడం చాలా కష్టమని నటీనటులు చెప్పడం వింటుంటాం. అలాంటి నవ్వించే పాత్రలను తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది కమెడియన్స్ సమర్థవంతంగా పోషిస్తున్నారు.

ఇప్పుడు టాలీవుడ్ లో హాస్యనటులకు కొదువ లేదు. ఎంతమంది ఉన్నా ఎవరికి వారు తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో వెన్నెల కిషోర్ - సత్య - సప్తగిరి - సునీల్ - శ్రీనివాస్ రెడ్డి - ప్రియదర్శి - సుహాష్ - రాహుల్ రామకృష్ణ - ప్రవీణ్ - సుదర్శన్ మరియు పలువురు జబర్దస్త్ కమెడియన్లు తనదైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నారు.

అయితే పాన్ ఇండియా చిత్రాలు - బైలింగ్విల్ సినిమాల సందడి మొదలైన తర్వాత స్టార్ హీరోలతో పాటుగా కమెడియన్స్ కూడా పక్క ఇండస్ట్రీలలో పాపులర్ అవ్వాలని ట్రై చేస్తున్నారు. ఇప్పటికే మన కమెడియన్స్ కొందరు ఇతర భాషల ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

బ్రహ్మానందం - అలీ లాంటి హాస్యనటులు ఇతర భాషా చిత్రాల్లోనూ మెరిసారు. సునీల్ అయితే విలన్ గానూ మెప్పించారు. ఇప్పుడు పమ్మి సాయి లాంటి హాస్య నటులు కూడా ఈ జాబితాలోకి చేరుతున్నారు. కెరీర్ ప్రారంభంలో చిన్న పాత్రలో కనిపించిన సాయి.. గత కొన్నేళ్లుగా తనదైన శైలి హాస్యంతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు.

ఇటీవల కాలంలో అనేక చిత్రాల్లో మంచి పాత్రలు చేసాడు. పాత్ర నిడివి ఎంతనేది పక్కన పెడితే.. ప్రతీ చిత్రంలోనూ తన ఉనికిని చాటుకుంటున్నాడు. కమెడియన్ గానే కాకుండా.. కాస్త నెగెటివ్ టచ్ ఉన్న క్యారక్టర్స్ లోనూ కామెడీ పండించడం పమ్మి సాయి ప్రత్యేకత.

త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి అగ్ర దర్శకుడు ప్రతీ సినిమాలోనూ సాయి కోసం ఓ పాత్ర రాస్తుంటాడంటేనే అతని టాలెంట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అందుకే టాలీవుడ్ లో బిజీ క్యారక్టర్ ఆర్టిస్టుల్లో ఒకడిగా కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకూ తెలుగు సినిమాలు మాత్రమే చేసిన శ్రీనివాస్ సాయి.. ఇప్పుడు 'సార్' చిత్రంతో కోలీవుడ్ లోనూ అడుగుపెడుతున్నాడు.

తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం ''సార్'' అనే ద్విభాషా చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. డబ్బింగ్ సినిమాలతో ఆకట్టుకున్న వర్సటైల్ హీరోకి ఇది ఫస్ట్ స్ట్రెయిట్ తెలుగు మూవీ. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైనెంట్స్ సంస్థ నిర్మిస్తోంది.

'సార్' సినిమాలో పమ్మి సాయి ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడని తెలుస్తోంది. తెలుగులో మంచి టైమింగ్ ఉన్న నటుడిగా పేరు తెచ్చుకున్న సాయి.. ఈ సినిమాతో తమిళ ప్రేక్షకులను ఆకట్టుకోడానికి రెడీ అవుతున్నాడు. మల్టీలాంగ్వేజ్ సినిమాలతో పమ్మి సాయి తో పాటుగా మరికొందరు టాలీవుడ్ కమెడియన్స్ ఇతర భాషల్లోనూ అలరిస్తున్నారని చెప్పాలి.