Begin typing your search above and press return to search.

చోళుల 'పొన్నియిన్‌ సెల్వన్‌' కు పోటీగా పల్లవుల 'నందివర్మన్'

By:  Tupaki Desk   |   17 Oct 2022 5:30 PM GMT
చోళుల పొన్నియిన్‌ సెల్వన్‌ కు పోటీగా పల్లవుల నందివర్మన్
X
సంగం యుగంలో దక్షిణ భారతదేశంలో చోళులు - చేర - పాండ్య రాజ్యాలు ఆధిపత్యం వహించాయని ప్రాచీన చరిత్ర చెబుతుంది. గుప్తానంతర యుగంలో పల్లవులు పరిపాలిస్తే.. రాజపుత్ర యుగంలో నవీన చోళులు కీలక పాత్ర పోషించారు. ఇటీవల లెజండరీ దర్శకుడు మణిరత్నం చోళుల నేపథ్యంలో ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ అనే సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. చోళ సామ్రాజ్యం - చోళ రాజుల వీర ధీరత్వాన్ని ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేసారు. అయితే ఇప్పుడు పల్లవుల నేపథ్యంలో సినిమా రాబోతోంది.

పల్లవ రాజుల పోరాట పటిమ మరియు పాలన విధానాన్ని తెలియజేసే ఉద్దేశ్యంతో తెరకెక్కించిన తమిళ చిత్రం ''నందివర్మన్‌''. పల్లవ రాజవంశం యొక్క చివరి ముఖ్యమైన రాజు నందివర్మన్ కావడంతో.. అతని పేరునే మూవీ టైటిల్ గా పెట్టారని అర్థమవుతోంది. జీవీ పెరుమాళ్‌ వరధాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సురేష్‌ రవి - ఆషా గౌడ హీరోహీరోయిన్లుగా నటించారు. ఏకే ఫిల్మ్‌ ఫ్యాక్టరీ బ్యానర్ లో రూపొందుతోన్న ఈ మూవీ టీజర్‌‌ ను మేకర్స్ ఇటీవలే విడుదల చేశారు.

'పొన్నియిన్‌ సెల్వన్‌' చిత్రాన్ని హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు. అయితే ఇక్కడ 'నందివర్మన్‌' సినిమాని ప్రెజెంట్ తో లింక్ చేస్తూ పల్లవుల చరిత్రను బయటపెట్టే యాక్షన్ మూవీగా రూపొందించారని తెలుస్తోంది. 'యుగానికొక్కడు' సినిమాలో చోళుల చరిత్ర చెప్పినట్లే.. ఇందులో పల్లవుల గురించి చెప్తున్నారని టీజర్ ని బట్టి తెలుస్తోంది.

పురావస్తు శాఖ బృందం సెంజికోట రహస్యాలను గుర్తించడానికి వెళ్ళగా.. పల్లవుల కథను బహిర్గతం చేసేలా ఈ చిత్రం కథ సాగుతుంది. సెంజి కోట రాజధానిగా చేసుకుని పరిపాలించిన పల్లవులు సామ్రాజ్యాన్ని.. వారి వైభవాన్ని చాటిచెప్పే విధంగా ఈ సినిమా ఉంటుందని దర్శకుడు తెలిపారు. దాదాపు వెయ్యి సంవత్సరాల కిత్రం నాటి పల్లవుల సామ్రాజ్యాన్ని కళ్ళకు కట్టేలే త్రీడి యానిమేషన్స్‌ విజువల్స్‌ ను ఇందులో తీసుకొచ్చామని పేర్కొన్నారు.

'నందివర్మన్‌' సినిమాని త్వరలోనే విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మణిరత్నం ‘పీఎస్‌’ కంటే ముందే ఈ సినిమా ప్రారంభించామని.. కరోనా, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల షూటింగ్‌ పూర్తి చేయడానికి ఆలస్యమైందని చెప్పారు. పల్లవులు మీ ముందుకు రాబోతున్నారు.. చూసి ఆదరించాలని ప్రేక్షకులను మేకర్స్ కోరారు. మరి ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుని ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

ఇకపోతే మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రాన్ని కల్కి రాసిన నవల ఆధారంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఇందులో విక్రమ్ - ఐశ్వర్యారాయ్ - కార్తి - జయం రవి - త్రిష - ప్రకాష్ రాజ్ - శరత్ కుమార్ - ఐశ్వర్య లక్ష్మి - శోభితా దూళిపాళ్ల వంటి భారీ తారాగణం నటించారు.

ఇటీవల విడుదలైన ఈ సినిమా కోలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. దీంతో ఇప్పుడు తమిళ జనాలు ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2’ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫస్ట్ పార్ట్ రిలీజైన తొమ్మిది నెలలో పీఎస్-2 వస్తుందని మణిరత్నం ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.