Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: ఇంటెన్స్.. రియలిస్టిక్ పలాస

By:  Tupaki Desk   |   1 March 2020 4:02 PM IST
ట్రైలర్ టాక్: ఇంటెన్స్.. రియలిస్టిక్ పలాస
X
రక్షిత్- నక్షత్ర హీరో హీరోయిన్లుగా కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'పలాస 1978'. సుధాస్ మీడియా పతాకంపై ఈ సినిమాను ధ్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భారద్వాజ ఈ సినిమాకు సమర్పకుడు. సురేష్ ప్రొడక్షన్స్ వారు ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. మార్చ్ 6 న ఈ సినిమా విడుదల అవుతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రానా దగ్గుబాటి రిలీజ్ చేశారు.

నిజ జీవితంలోని వ్యక్తుల ఆధారంగా తెరకెక్కించిన పలాస కథ అంటూ ఈ సినిమా గురించి ట్రైలర్ ఆరంభంలోనే వెల్లడించారు. ఫస్ట్ సీన్ లో ఒక వ్యక్తి హార్మోనియం వాయిస్తే పాటలు పడుతూ ఉంటాడు. ఇక నెక్స్ట్ సీన్ లో "1989 లో ఫిబ్రవరి 4 వ తేదీన పలాస మార్కెట్ లో జరిగిన హత్య కేసయ్యా ఇది" అంటూ నేపథ్యంలో ఒకరు చెప్తూ ఉంటే ఆ హత్య విజువల్స్ చూపిస్తారు. మరో సీన్ లో ఒక కానిస్టేబుల్ 'వీళ్లు పద్యాల సుందర్రావు కొడుకులు. మంచి పాటగాళ్లు" అంటూ హీరో గ్యాంగ్ గురించి చెప్తాడు. ఇవే కాకుండా నెక్స్ట్ సీన్లలో వచ్చే "తమ్ముడిని చంపాలంటే ఆలోచన వస్తది తప్పులేదు.. కానీ మనం ఎదగడం కోసం చేసే ఏ పని కూడా తప్పు కాదు".. "బురదలోని దిగిపోయినం. కాళ్లు కడుక్కోవడానికి నీళ్లు సరిపోవు" డైలాగ్స్ కూడా పవర్ఫుల్ గా ఉన్నాయి.

ట్రైలర్ లో ఒక రియలిస్టిక్ ఫీల్ ఉంది. ఇక పలాస నేపథ్యం.. శ్రీకాకుళం యాసను సీరియస్ గా చూపించడం కొత్తగా ఉంది. యాక్షన్ సీన్స్ ఇంటెన్స్ గా ఉన్నాయి. ముఖ్యంగా ట్రైలర్ లో సగం నుంచి చూపించే ఇంటెన్స్ సీన్స్.. వాటికి మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె అందించిన నేపథ్య సంగీతం సూపర్. ఈ యాక్షన్ తో పాటు ఉత్తరాంధ్ర జానపద పాటలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమా రొటీన్ ఫార్మాట్ కాదు.. విషయం ఉందనిపిస్తోంది. ఆలస్యం ఎందుకు.. చూసేయండి 'పలాస 1978' ట్రైలర్. .