Begin typing your search above and press return to search.

కేజీఎఫ్ లా ఈసారి వ‌ర్క‌వుట‌వుతుందా?

By:  Tupaki Desk   |   8 Sep 2019 6:01 AM GMT
కేజీఎఫ్ లా ఈసారి వ‌ర్క‌వుట‌వుతుందా?
X
భారీ బ‌డ్జెట్ చిత్రాల ఫేట్ రిలీజ్ డే తొలి ఆట‌తోనే డిసైడ్ అవుతోంది. ప్రివ్యూల నుంచే హిట్టా ఫ‌ట్టా అన్న టాక్ వ‌చ్చేస్తోంది. దానికి తోడు సోష‌ల్ మీడియాలు.. యూట్యూబ్ రివ్యూల దెబ్బ‌కు ఏదేదో జ‌రుగుతోంది. డే వ‌న్ లోనే సినిమాలో స‌త్తా ఎంతో నేరుగా ప్రేక్ష‌క మ‌హాశ‌యుల‌కు తెలిసిపోతోంది. ప‌ర్య‌వ‌సానంగా ఆ సినిమా చూడాలా వ‌ద్దా? అన్న‌ది జ‌నాలు బ్లైండ్ గా మైండ్ లో ఫిక్స‌యిపోతున్నారు. హిట్టు టాక్ వ‌స్తే ఓకే కానీ ఫ్లాప్ అన్న టాక్ వ‌స్తేనే అస‌లు తంటా వ‌చ్చి ప‌డుతోంది. భారీ సినిమా అన్న క్రేజుతో తొలి వీకెండ్ టిక్కెట్ల ధ‌ర‌లు పెంచుకుని అమ్మేస్తున్నారు కాబ‌ట్టి కొంత‌వ‌ర‌కూ వెన‌క్కి వ‌చ్చేస్తోంది. అయితే నాలుగో రోజు నుంచి అస‌లు క‌థ మొద‌లువుతోంది. థియేట‌ర్ ఆక్యుపెన్సీ 50 శాతం నుంచి 30శాతానికి 20 శాతానికి ప‌డిపోవ‌డం కొన్ని థియేట‌ర్ల‌లో అయితే రిలీజైన ఐదో రోజుకే 10 మంది మించి ప్రేక్ష‌కులు కుర్చీల్లో క‌నిపించ‌క పోవ‌డం వ‌గైరా చూస్తుంటే స‌న్నివేశం ఎంత దారుణంగా ఉందో అర్థ‌మ‌వుతోంది.

యూట్యూబ్- సోష‌ల్ మీడియా దెబ్బ ఎలా ఉంటుందో ఇటీవ‌లే రిలీజైన `సాహో` అనుభ‌వం చెబుతోంది. లైవ్ లోనే థియేట‌ర్ల నుంచి వ‌చ్చే జ‌నం తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిట్టేయ‌డం క‌నిపించింది. దానివ‌ల్ల చాలా వ‌ర‌కూ నెగెటివిటీ స్ప్రెడ్ అయిపోయింది. కొంద‌రు క్లాస్ బావుంద‌ని ప్ర‌శంస‌లు కురిపించడంతో సాహో విష‌యంలో మిశ్ర‌మ స్పంద‌న వ్య‌క్త‌మైంది. టాలీవుడ్ క్రిటిక్స్ కంటే యూట్యూబ్ క్రిటిక్స్.. థియేట‌ర్ల నుంచి వ‌చ్చే ఆడియెన్ క్రిటిసిజం భారీ చిత్రాల‌కు కొల‌మానంగా మారిపోయింది. కేవ‌లం ఈ రెండేళ్ల‌లో వ‌చ్చిన మార్పు ఇది. అయితే త‌దుప‌రి రిలీజ‌వుతున్న `సైరా -న‌రిసింహారెడ్డి` విష‌యంలో క్రిటిసిజం ఎలా ఉండ‌బోతోంది? అన్న చ‌ర్చా మొద‌లైంది. ఈ సినిమాకి మెగాభిమానుల నుంచి స్పంద‌న ఎలా ఉండ‌బోతోంది? పాన్ ఇండియా సినిమాగా దాదాపు ఐదు భాష‌ల్లో రిలీజ్ కి రెడీ అవుతోంది సైరా. తెలుగు-త‌మిళం-హిందీ-క‌న్న‌డం-మ‌ల‌యాళంలో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తొలి రోజు తొలి ఆట హిట్టు టాక్ రాక‌పోతే మాత్రం ఆ ప్ర‌భావం బాక్సాఫీస్ పై తీవ్రంగా ఉంటుంద‌న‌డంలో సందేహ‌మే లేదు.

సైరా సంగ‌తి అటుంచితే అంత‌కంటే ముందే ఈ త‌ర‌హా క్రిటిసిజం సెగ ఎదుర్కోబోతున్న మ‌రో పాన్ ఇండియా సినిమా ఏదో తెలుసా? అదే ప‌హిల్వాన్. కిచ్చా సుదీప్ న‌టించిన ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రాన్ని వారాహి చల‌న చిత్రం సంస్థ తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తోంది. 12 సెప్టెంబ‌ర్ రిలీజ్ తేదీ. తెలుగు-త‌మిళం-హిందీ-క‌న్న‌డం-మ‌ల‌యాళంలో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ్ చేస్తున్నారు. సుదీప్ కుస్తీ ప‌ట్లు ప‌ట్టే రెజ్ల‌ర్ గా అలాగే బాక్స‌ర్ గా న‌టించారు. అత‌డి గురువు (కోచ్) పాత్ర‌లో బాలీవుడ్ న‌టుడు సునీల్ శెట్టి న‌టించారు. ఎస్.కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. ఆర్.ఆర్.ఆర్. మోష‌న్ పిక్చ‌ర్స్ సంస్థ నిర్మించింది. ఇప్ప‌టికే రిలీజైన టీజ‌ర్ ఆక‌ట్టుకుంది. అయితే పాన్ ఇండియా బేసిస్ లో రిలీజ‌వుతున్న ఈ సినిమాపై అంత హైప్ క‌నిపించ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. తెలుగులోనూ ప్రీరిలీజ్ వేడుక మిన‌హా స‌రైన ప్ర‌చారం లేదు. వారాహి సంస్థ రిలీజ్ చేసిన కేజీఎఫ్ సైతం ప్ర‌చారం లేక‌పోవ‌డంతో ఆరంభం నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. ఆ సినిమా కంటెంట్ ప‌రంగా నెగ్గుకొచ్చినా.. ఈసారి ప‌హిల్వాన్ విష‌యంలో అలా ప‌ప్పులు ఉడుకుతాయా? అన్న‌ది చూడాలి.