Begin typing your search above and press return to search.

సినిమా వద్దు.. పాఠం పెడతాం

By:  Tupaki Desk   |   23 Nov 2017 4:18 AM GMT
సినిమా వద్దు.. పాఠం పెడతాం
X
బాలీవుడ్ లో రాబోతున్న పద్మావతి చిత్రం రిలీజ్ కు ముందు ఎంత బజ్ సంపాదించుకుందో అంతకు అంత వివాదాల్లోనూ కూరుకుపోతోంది. ఈ సినిమాలో రాణి పద్మావతి చరిత్రను వక్రీకరించారంటూ రాజపుట్ వంశీకులు అభ్యంతరం లేవనెత్తారు. తమ గౌరవానికి ప్రతీక అయిన పద్మావతిని ఈ సినిమాలో తప్పుగా చూపించారంటూ ఆందోళనలకు కూడా దిగారు. ఈ గొడవల మధ్య సినిమా రిలీజ్ వాయిదా పడింది.

ఇంతవరకు పద్మావతి చరిత్ర గురించి పట్టించుకోని వారికి ఇప్పుడు సినిమా చుట్టూ వస్తున్న వివాదాలతో ఉన్నట్టుండి ఆమె గుర్తొచ్చింది. ఆ బాటలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఓ అడుగు ముందుకేశాడు. ఏకంగా ఆమె చరిత్రను రివైజ్ చేసి పిల్లలకు పాఠ్యాంశంగా పెడతామంటున్నారు. మహారాణి పద్మావతి జీవిత చరిత్ర గురించి ప్రజలెవరికీ తెలియడం లేదు. అందుకే పద్మావతి చరిత్రను తెలియజేసేలా ఓ అధ్యాయాన్ని తీసుకొస్తాం’ అనేది ఆయన మాట. ప్రస్తుతం ఉన్న మధ్యప్రదేశ్‌ పాఠ్యపుస్తకాల్లో చిత్తోత్ గఢ్‌ను అల్లాఉద్దీన్‌ ఖిల్జీ ముట్టడించడం వరకు మాత్రమే ఉంది. దీనిని ఇప్పుడు రివైజ్ చేసి రాణి పద్మావతి గొప్పతనాన్ని మరింత గొప్పగా చెబుతూ పాఠం తయారు చేయిస్తామంటున్నారు. పద్మావతి సినిమాపై తమ రాష్ట్రంలో నిషేధం విధిస్తున్నట్లు శివరాజ్ సింగ్ ప్రకటించారు.

బాలీవుడ్ లో భారీ చిత్రాల దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్ లో రూపొందిన పద్మావతి సినిమాలో రాణి పద్మావతిగా దీపికా పదుకొనే.. ఆమె భర్త గా షాహిద్ కపూర్ నటించారు. ఇక ఆమెను మోహించిన అల్లావుద్దీన్ ఖిల్జీగా రణ్ వీర్ సింగ్ కనిపించనున్నాడు. ఈ వివాదాలు అన్నీ చల్లార్చేందుకు సినిమా యూనిట్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. అవి కొలిక్కొచ్చాకే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకొస్తుంది.