Begin typing your search above and press return to search.

ఇప్పుడు ‘మెర్శల్’.. తర్వాత ‘పద్మావతి’?

By:  Tupaki Desk   |   8 Nov 2017 1:30 AM GMT
ఇప్పుడు ‘మెర్శల్’.. తర్వాత ‘పద్మావతి’?
X
దీపావళికి తమిళంలో విడుదలైన ‘మెర్శల్’ సినిమాకు మరీ గొప్ప టాక్ ఏమీ రాలేదు. కానీ ఆ సినిమా భారీ వసూళ్లు రాబట్టుకుంది. ఇందుకు ఒక రకంగా దాని చుట్టూ ముసురుకున్న వివాదాలు కూడా కారణమని చెప్పాలి. ఇందులో జీఎస్టీకి, వైద్యులకు వ్యతిరేకంగా ఉన్న డైలాగుల మీద చాలా పెద్ద రగడే నడిచింది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నాయకులు జీఎస్టీ డైలాగ్ మీద చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ గొడవ వల్ల సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ వచ్చింది. వసూళ్లు మరింత పెరిగాయి. సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయింది. మొత్తానికి బీజేపీ నేతలు దీని వల్ల ఏం వారుకున్నారో కానీ.. ఈ సినిమాకు మాత్రం వారి వల్ల చాలానే ప్రయోజనం కలిగింది.

ఇప్పుడు ఇదే తరహాలో బాలీవుడ్ మూవీ ‘పద్మావతి’ కూడా లాభం పొందేలా ఉంది. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి దీని చుట్టూ వివాదాలు నడుస్తున్నాయి. ఈ సినిమా షూటింగును అడ్డుకుంటూ యూనిట్ సభ్యులపై దాడి కూడా చేశారు. దాని వల్ల సినిమాకు మంచి పబ్లిసిటీ వచ్చింది. ఐతే ఈ మధ్య ఈ గొడవలు సద్దుమనగగా.. ఇప్పుడు మళ్లీ రచ్చ మొదలుపెట్టి సినిమాకు పబ్లిసిటీ తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లున్నారు.

హైదరారాద్‌ గోషా మహల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ‘పద్మావతి’ సినిమాను ముందుగానే రాజ్‌ పుత్‌ లకు చూపించి.. వాళ్ల అనుమతి తీసుకోకుండా రిలీజ్ చేస్తే.. ఆ సినిమా ప్రదర్శించే థియేటర్లను తగులబెడుతామని హెచ్చరించారు. హిందు ధర్మాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరు సినిమాను బాయ్‌కాట్ చేయడమే కాదు.. అసలు రిలీజ్ కాకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఈ మాత్రం గొడవ చాలదా సినిమాకు మంచి పబ్లిసిటీ రావడానికి. రిలీజ్ టైంలోనూ ఇలాగే గొడవ చేస్తే ‘మెర్శల్’ లాగే ‘పద్మావతి’కి కూడా వసూళ్ల విషయంలో బాగా కలిసొస్తుందేమో.