Begin typing your search above and press return to search.

ఆ రాష్ట్రాల్లో ‘పద్మావత్’కు బ్రేక్

By:  Tupaki Desk   |   25 Jan 2018 11:57 AM GMT
ఆ రాష్ట్రాల్లో ‘పద్మావత్’కు బ్రేక్
X
అనుకున్నదే అయింది. ఆందోళనే నిజమైంది. ‘పద్మావత్’ సినిమా విడుదలతో ఉత్తరాది రాష్ట్రాలు అట్టుడికాయి. సినిమాలో రాజ్ పుత్ లకు వ్యతిరేకంగా ఒక్క సీన్ కూడా లేకపోయినా.. ఈ సినిమాను ఎంతమాత్రం వ్యతిరేకించాల్సిన అవసరం లేకపోయిన కర్ణిసేనకు చెందిన దళాలు రెచ్చిపోయాయి. అనవసర ఆందోళనలకు.. గొడవలకు దిగాయి. ఉత్తరాదిన నాలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు బ్రేక్ పడింది. కర్ణిసేన ప్రభావం బాగా ఉన్న మధ్యప్రదేశ్.. గుజరాత్.. రాజస్థాన్.. గోవా రాష్ట్రాల్లో కర్ణిసేన కార్యకర్తలు రెచ్చిపోయారు. రోడ్ల మీదికి వచ్చి ఆందోళనలకు తెరతీశారు. అల్లర్లు సృష్టించారు. దీంతో ఆ రాష్ట్రాల్లో చాలా వరకు ‘పద్మావత్’ ప్రదర్శన ఆగిపోయింది.

ఈ గొడవలతో ఆయా రాష్ట్రాల్లోని మల్టీప్లెక్స్ థియేటర్ల యజమానుల సంఘం స్వచ్ఛందంగా సినిమా ప్రదర్శన ఆపేయాలని నిర్ణయించింది. ఈ రాష్ట్రాల్లో అక్కడక్కడా అల్లర్ల కారణంగా ఆస్తి నష్టం జరిగింది. విడుదలకు ముందు రోజే అహ్మదాబాద్‌ లోని ఒక మాల్ దగ్గర వాహనాలు తగులబెట్టి విధ్వంసం సృష్టించడం.. ఒక స్కూల్ బస్ మీదా దాడికి దిగి పిల్లల్ని గాయపరచడం తెలిసిన సంగతే. ఐతే దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం ‘పద్మావత్’కు పెద్దగా ఇబ్బంది లేకపోయింది. థియేటర్ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడక్కడా ఆందోళనలు జరిగినప్పటికీ అవి తీవ్రమైనవేమీ కాదు. సౌత్ లో ఈ చిత్రం 400కు పైగా థియేటర్లలో రిలీజైంది. తెలుగు.. తమిళ భాషల్లో కూడా సినిమాను విడుదల చేశారు.