Begin typing your search above and press return to search.

పాకిస్తాన్ లో పద్మావత్-ఇదీ అచ్చీ బాత్

By:  Tupaki Desk   |   26 Jan 2018 12:04 PM GMT
పాకిస్తాన్ లో పద్మావత్-ఇదీ అచ్చీ బాత్
X
నిన్న విడుదలైన పద్మావత్ పై ఒకవైపు ప్రశంశల వర్షం కురుస్తున్నా మరో వైపు రెండు మూడు రాష్ట్రాల్లో దీనిపై ఎగసిపడుతున్న నిరసన జ్వాలలు ఇంకా చల్లారడం లేదు. రాజ్ పుత్ వర్గానికి వ్యతిరేకంగా సినిమాలో ఏమి లేదు అని తేలడంతో చాలా చోట్ల పరిస్థితి నార్మల్ గానే ఉంది. ఆందోళన ఉదృతంగా ఉన్న రాజస్తాన్ - గుజరాత్ రాష్ట్రాల్లో కొన్ని నగరాలు మినహాయిస్తే దేశవ్యాప్తంగా పోలీస్ సెక్యూరిటీతో సినిమా విడుదలైంది. కంటెంట్ ఎలా ఉంది అన్నది పక్కన పెడితే భన్సాలీ కష్టానికి తగ్గ కామెంట్స్ అయితే పొగడ్తల రూపంలో అందుతున్నాయి. ఇప్పుడు దాయాది దేశం పాకిస్తాన్ లో పద్మావత్ విడుదలకు లైన్ క్లియర్ కావడం బాలీవుడ్ వర్గాలను సైతం ఆశ్చర్యంలో పడేసింది. తమ వర్గానికి చెందిన వారిని ఏ మాత్రం కించపరిచినట్టు చిన్న సన్నివేశం ఉన్నా లేక పాత్ర ఉన్నా సెన్సార్ ఇవ్వకుండా అడ్డుకునే పాకిస్తాన్ హిందూ సంప్రదాయాన్ని ప్రతిబింబించే సినిమాకు కట్స్ లేకుండా క్లియరెన్స్ ఇవ్వడం వింతే.

ఇందులో విలన్ పాత్ర అయిన అల్లాయుద్దిన్ ఖిల్జీ ముస్లిం అయినప్పటికీ అతనికి పాకిస్తాన్ కు ఎటువంటి సంబంధం ఉండదు. అవిభక్త భారతదేశ చరిత్రలో జరిగింది చూపిస్తున్నారు కాబట్టి తమ దేశం గురించి కాని పౌరుల గురించి కాని అభ్యంతరం అనిపించే ఎటువంటి సన్నివేశాలు లేకపోవడంతో సర్టిఫికేట్ ఇచ్చి విడుదల చేసుకోమని చెప్పేసారు. పైగా ఒక్క చిన్న కట్ కూడా చెప్పలేదట. ఖాయిద్-ఈ-అజాం యూనివర్సిటీ నుంచి చరిత్ర నిపుణుడి సమక్షంలో సినిమా చూపించి అయన ఇందులో మనం అభ్యంతర పెట్టేది ఏమి లేదు అని చెప్పడంతో క్లీన్ యు సర్టిఫికేట్ ఇచ్చేసారు.

టైగర్ జిందా హై - ఎక్ థా టైగర్ - ఎంఎస్ ధోని లాంటి సినిమాలకు సర్టిఫికేట్ ఇవ్వకుండా పాకిస్తాన్ లో విడుదలను ఆపేసిన పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి పద్మావత్ ఇప్పుడు క్లియరెన్స్ తెచ్చుకోవడం ఘనతగానే చెప్పుకోవాలి. ఎక్కువ ఆలస్యం చేయకుండా అక్కడ భారీ ఎత్తున విడుదల చేసేందుకు భన్సాలీ ఏర్పాట్లు చేస్తున్నాడు. ఇక్కడ వ్యతిరేకత వ్యక్తమవుతున్న పద్మావత్ కు అక్కడ సాదర స్వాగతం లభించడం విశేషమేగా.