Begin typing your search above and press return to search.

డిఫరెంట్ థ్రిల్లర్ గా 'పచ్చీస్‌' అందర్నీ ఆకట్టుకుంటుంది: రామ్స్

By:  Tupaki Desk   |   11 Jun 2021 11:00 PM IST
డిఫరెంట్ థ్రిల్లర్ గా పచ్చీస్‌ అందర్నీ ఆకట్టుకుంటుంది: రామ్స్
X
టాలీవుడ్‌ సెలబ్రిటీ డిజైనర్‌ రామ్స్‌ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం 'పచ్చీస్‌'. క్రైమ్ థ్రిల్ల‌ర్‌ కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రానికి శ్రీ‌ కృష్ణ‌ & రామ సాయి సంయుక్తంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇందులో శ్వేతావర్మ హీరోయిన్ గా నటిస్తోంది. అవస చిత్రం మరియు రాస్తా ఫిలిమ్స్ ప‌తాకాల‌పై కౌశిక్ కుమార్ క‌త్తూరి - రామ సాయి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'పచ్చీస్‌' చిత్రం ఈ నెల 12 నుంచి ఆమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో రామ్స్ మీడియాతో ముచ్చటించారు.

రామ్స్ మాట్లాడుతూ.. ''సినిమాపై ఒక ప్యాషన్‌ తో భీమవరం నుంచి వచ్చి ఇక్కడ ముందు కాస్ట్యూమ్‌ డిజైనర్‌ గా చేరాను. నాగార్జున - విజయ్‌ దేవరకొండ - రామ్‌ పోతినేని - అడివి శేషు - రానా.. ఇలా చాలామంది హీరోలకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌ గా వర్క్‌ చేశాను. టాలీవుడ్‌ లో ఉన్న 75 శాతం మంది హీరోలకు నేను కాస్ట్యూమ్‌ డిజైనింగ్‌ చేశాను. ఇండస్ట్రీకి హీరో అవుదామనే వచ్చాను. కానీ ముందుగా ఇండస్ట్రీలో ఒక చోటు కావాలి కాబట్టి కాస్ట్యూమ్‌ డిజైనర్‌ గా చేశాను'' అని చెప్పారు.

''మంచి కథ కుదిరితే ఎప్పట్నుంచో సినిమా చేద్దామని అనుకుంటున్నాను. అలాంటి సమయంలో దర్శకులు శ్రీ కృష్ణ - రామ సాయి చెప్పిన థ్రిల్లింగ్‌ కథ బాగా నచ్చింది. ఇండస్ట్రీలోకి వచ్చే కొత్తవారిలో ఒక రకమైన ఫైర్‌ ఉంటుంది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో నాలోనూ అలాంటి ఫైరే ఉండేది. అందుకే కొత్తవారికి అవకాశం ఇచ్చేందుకు ఈ 'పచ్చీస్‌' సినిమాకు ఒకే చెప్పాను. ఇందులో దాదాపు అందరూ కొత్తవారే. ఇదొక డిఫరెంట్‌ థ్రిల్లర్‌. కథ, కథనాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తాయి. రెగ్యులర్‌ సినిమాకు భిన్నంగా ఉండే మా 'పచ్చీస్‌' సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను''

''నాగార్జున - రానా - విజయ్ - అడివి శేష్‌ వంటి వారు మా సినిమాకు సపోర్ట్‌ చేయడం వల్ల మా సినిమాకు మరింత రీచ్‌ వచ్చింది. వీరి ప్రోత్సాహం లేకపోతే ఇంత రీచ్‌ వచ్చేది కాదు. ట్రైలర్‌ చూసిన వారందరు
బాగుందని అంటున్నారు. విజువల్స్, మ్యూజిక్‌ బాగున్నాయని అభినందిస్తున్నారు. నెక్ట్స్‌ రెండు సినిమాలకు సైన్‌ చేశాను. ఇవి కూడా భిన్నమైన సినిమాలే. ముందుగా నన్ను నేను ఒక మంచి నటుడిగా నిరూపించు కోవాలనుకుంటున్నాను. ప్రేక్షకులు మెప్పు కోరుకుంటున్నాను. హిట్టు, ఫ్లాప్‌ లతో సంబంధం లేకుండా నా సినిమా జర్నీని కొనసాగిద్దామని అనుకుంటున్నాను. దీనికి మా ఫ్యామిలీ నుంచి ప్రోత్సాహం ఉంది. 'పచ్చీస్‌' సినిమాను థియేటర్స్‌ లోనే విడుదల చేద్దామని అనుకున్నాం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఓటీటీకి వెళుతున్నాం. 'పచ్చీస్‌' సినిమా బాగా రావడానకి సహకరించిన చిత్ర బృందానికి ధన్యవాదాలు'' అని రామ్స్ చెప్పుకొచ్చారు.