Begin typing your search above and press return to search.

థియేటర్లలోనే 'పాగల్'.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

By:  Tupaki Desk   |   7 Aug 2021 1:23 PM GMT
థియేటర్లలోనే పాగల్.. రిలీజ్ డేట్ ఫిక్స్..!
X
కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరుచుకోవడంతో ఒక్కరొక్కరుగా సినిమాల విడుదల తేదీలను ప్రకటిస్తారు. ఇప్పటి వరకు చిన్న సినిమాలే థియేట్రికల్ రిలీజ్ అవుతుండగా.. ఇప్పుడు 'మాస్ కా దాస్' విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కుతున్న ''పాగల్'' చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడానికి ముందుకు వచ్చాడు. ఈ సినిమా విడుదల తేదీని తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

విభిన్నమైన కథలను ఎంచుకుంటూ యూత్ లో మంచి క్రేజ్‌ సొంతం చేసుకున్న విశ్వక్ సేన్.. 'పాగల్' చిత్రాన్ని సమ్మర్ లోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకున్నారు. అయితే కరోనా పరిస్థితుల్లో వాయిదా వేసుకున్నారు. ఈ గ్యాప్ లో ఓటీటీ ఆఫర్స్ వచ్చినా థియేటర్ల ద్వారానే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని వెయిట్ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు 'పాగల్' చిత్రాన్ని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 14న గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం ఓ పోస్టర్ ద్వారా ప్రకటించింది.

''పాగల్'' విశ్వక్ సేన్ కు 5వ సినిమా. న‌రేష్ కొప్పల్లి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని లక్కీ మీడియా బ్యానర్ పై బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. ఈ యూత్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లో విశ్వక్ సేన్ సరసన నివేదా పేతురాజ్ - సిమ్రాన్ చౌదరి - మేఘ లేఖ హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే విడుదలైన 'పాగల్' ఫస్ట్ లుక్ - టీజర్ - సాంగ్స్ మంచి స్పందన తెచ్చుకున్నాయి.

రథన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ఎస్ మణికందన్ సినిమాటోగ్రఫీ అందించగా.. గ్యారీ ఎడిటింగ్ వర్క్ చేశారు. ఈ చిత్రంలో రాహుల్ రామకృష్ణ - మురళీ శర్మ ఇతర పాత్రలు పోషించారు. వరుస హిట్స్ తో జోష్ మీదున్న విశ్వక్ సేన్ కు ''పాగల్'' ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.