Begin typing your search above and press return to search.

ఔను.. రజినీకాంత్‌ తో సినిమా చేస్తున్నా

By:  Tupaki Desk   |   1 Sep 2016 1:30 PM GMT
ఔను.. రజినీకాంత్‌ తో సినిమా చేస్తున్నా
X
రెండే రెండు సినిమాల అనుభవంతో సూపర్ స్టార్ రజినీకాంత్‌ తో సినిమా చేసే ఛాన్స్ కొట్టేశాడు పా.రంజిత్. ‘కబాలి’ రూపంలో అతడికి ఓ అద్భుత అవకాశం దక్కింది. ఈ సినిమా టీజర్ చూశాక.. జనాల ఫీలింగ్ మారింది. రంజిత్‌తో పని చేయడమే రజినీ అదృష్టం అన్నట్లు మాట్లాడారు. టీజర్ వరకు సూపర్ స్టార్‌ను అంత బాగా చూపించాడు పా.రంజిత్. కానీ తెరమీద బొమ్మ చూస్తే ఇంకో రకంగా కనబడింది. నీరసించిన రజినీని చూసి అభిమానులు తీవ్రంగా నిరాశ చెందారు. ఐతే ప్రేక్షకులు నిరాశ చెందినా.. రజినీ మాత్రం రంజిత్ పనితీరుతో సంతృప్తి చెందాడు. ఎవ్వరూ ఊహించని విధంగా అతడికి మరో అవకాశమిచ్చాడు. వీళ్లిద్దరి కాంబినేషన్లో రాబోయే రెండో సినిమాను రజినీ అల్లుడు ధనుషే స్వయంగా నిర్మిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడీ సినిమా విషయంలో స్వయంగా రంజితే స్పందించాడు రజినీతో మరో సినిమా చేయబోతున్న విషయం వాస్తవమే అన్నాడు. ఐతే ఇది అందరూ అనుకుంటున్నట్లు కబాలి సీక్వెల్ కాదని చెప్పాడు. ‘కబాలి’ విడుదల తర్వాత దీని సీక్వెల్ గురించి ప్రచారం జరిగింది. ఆ సినిమా నిర్మాత కలైపులి థాను కూడా సీక్వెల్ విషయంలో ఆసక్తి చూపించాడు. సీక్వెల్ చేయడానికి ఆ కథ ఓపెన్‌ గా ఉందని చెప్పాడు. ఐతే ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువగా ఎదుర్కొన్న సినిమాకు సీక్వెల్ అంటే జనాల ఫీలింగ్ ఇంకోలా ఉంటుందనుకున్నాడో ఏమో.. రజినీ కోసం కొత్త కథ రెడీ చేస్తున్నట్లు చెప్పాడు రంజిత్. ‘కబాలి’ తర్వాత రంజిత్‌ తో పని చేయడానికి వేరే స్టార్ హీరోలు అంతగా ఆసక్తి చూపించని నేపథ్యంలో రజినీనే అతడికి మరో అవకాశమివ్వడం విశేషమే.