Begin typing your search above and press return to search.

సూపర్‌స్టార్‌ ఎంత మాస్‌ అంటే..

By:  Tupaki Desk   |   18 July 2016 9:30 AM GMT
సూపర్‌స్టార్‌ ఎంత మాస్‌ అంటే..
X
ఇండియాలో మాస్ అనే పదానికి అసలైన అర్థం ఏంటో చెప్పిన హీరోల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ ఒకడు. ఆయనకున్న మాస్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. రజినీ సినిమా అంటే మాస్ థియేటర్లకు పోటెత్తుతారు. ‘కబాలి’ వారిని ఎంత మాత్రం నిరాశపరచదని అంటున్నాడు దర్శకుడు పా.రంజిత్. ఇన్నాళ్లూ చూసిన రజినీకి.. ఈ సినిమాలో రజినీకి తేడా ఉంటుందని.. ఆయన నటన భిన్నంగా ఉంటుందని.. అలాగని మాస్ ఆడియన్స్‌ డిజప్పాయింట్ అయ్యేలా ఏమీ సినిమా ఉండదని రంజిత్ చెప్పాడు.

‘‘రజనీ సార్‌ నటన గత సినిమాల కంటే వైవిధ్యంగా ఉంటుంది. ఆయన సినిమాల్లో రెగ్యులర్‌ గా కనిపించే మేనరిజమ్స్ ఇందులో ఉండవు. కానీ సూపర్ స్టార్ అద్భుత అభినయం చూపించడానికి అవసరమైన అద్భుతమైన సందర్భాలు ఈ కథలో వున్నాయి. కోపం.. సంతోషం.. బాధ... ఇలా అన్ని రకాల భావోద్వేగాలను ఆయన పండించాడు. వాటితో ప్రేక్షకులకు ఈజీగా కనెక్టవుతారు. సూపర్‌ స్టార్‌ ను ఎంత మాస్‌ గా చూస్తే బాగుంటుందని అభిమానులు ఆశిస్తారో ఆ స్థాయిలో ‘కబాలి’ ఉంటుంది. ఐతే ప్రత్యేకంగా రెగ్యులర్ మాస్ సినిమాల్లో ఉన్నట్లు పెట్టుడు సన్నివేశాలు ఇందులో ఉండవు. రజనీ సార్‌ కోపంలో.. ఎమోషన్‌ లో ఉన్నపుడు వచ్చే సీన్లు మాస్‌ గా ఉంటాయి’’ అని పా.రంజిత్ చెప్పాడు.

సినిమా మీద ఉన్న భారీ అంచనాల ఒత్తిడి గురించి మాట్లాడుతూ.. ‘‘సూపర్‌ స్టార్‌ తో సినిమా అంటే టెన్షన్ ఖచ్చితంగా ఉంటుంది. ఐతే సినిమా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందన్న నమ్మకం ఉంది. మా టెక్నీషియన్లు.. నటీనటులందరికీ సినిమా నచ్చింది. రజనీ సార్‌ కూడా చూశారు. ఆయనకీ బాగా నచ్చింది. అందరం సంతృప్తి చెందాం. ఫలితం విషయంలో ఆత్మవిశ్వాసంతో ఉన్నాం’’ అని రంజిత్ అన్నాడు.