Begin typing your search above and press return to search.

ఓవర్సీస్ మార్కెట్: టాలీవుడ్ దిద్దుబాటు చర్యలు?

By:  Tupaki Desk   |   4 Dec 2019 6:20 AM GMT
ఓవర్సీస్ మార్కెట్: టాలీవుడ్ దిద్దుబాటు చర్యలు?
X
తెలుగు సినిమాల కలెక్షన్స్ ప్రస్తావన వచ్చినప్పుడు ఓవర్సీస్ మార్కెట్ గురించి మాట్లాడుకోవడం చాలా సాధారణంగా మారింది. అయితే గత కొంతకాలంగా ఓవర్సీస్ లో సినిమాలు చతికిల పడుతుండడంతో అటు అమెరికా పంపిణీదారులలోనూ.. ఇటు నిర్మాతలలోనూ ఆందోళనకు కారణం అవుతోంది.

ఓవర్సీస్ మార్కెట్ లో జరిగిన జరుగుతున్న కొన్ని అంశాలను మనం పరిశీలిస్తే.. చాలాకాలంగా ఓవర్సీస్ మార్కెట్ వివరీతంగా పెరిగిందని.. నైజామ్ మార్కెట్ ను కూడా మించిపోయిందని ప్రచారం సాగింది. నిజానికి అలా ఏం జరగలేదు. వేళ్ళ మీద లెక్కపెట్టగలిగే కొన్ని సినిమాలకు తప్ప ఏ సినిమాకు 2 మిలియన్ డాలర్ కలెక్షన్లు దాటడంలేదు. ఆ 2 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ లో కూడా థియేటర్ లీజులు.. పబ్లిసిటీ ఖర్చులు .. టాక్సులు అన్నీ తీస్తే మిగిలేది శూన్యం. అయితే కొందరు ఫిలిం మేకర్లు కావాలని కొన్ని వెబ్ సైట్లకు డబ్బిచ్చి వారి సినిమాల విలువ పెంచుకునేందుకు నైజాం కంటే ఓవర్సీస్ పెద్ద మార్కెట్ అయిందనే ప్రచారానికి కొంతకాలం క్రితం తెరతీసినట్టు టాక్ వినిపిస్తోంది. దీనివల్లే సగం ఓవర్సీస్ మార్కెట్ దెబ్బ తిన్నదని కూడా ఆరోపణలు ఉన్నాయి.

ఇక్కడ మనం ఆలోచించాల్సిన మరో విషయం ఏంటంటే నిజంగా ఓవర్సీస్ మార్కెట్ నైజాం ను మించిపోతే ఇక్కడ నైజాం లో టాప్ డిస్ట్రిబ్యూటర్లుగా ఉన్న దిల్ రాజు.. ఏషియన్ సునీల్ లాంటివారు ఓవర్సీస్ పై దృష్టిసారించకుండా ఉంటారా? అక్కడ ఎప్పుడో పౌర్ణమికి అమావాస్యకు మాత్రమే హిట్లు.. మిగతా అంతా బయ్యర్లకు బ్యాండే. మరోవైపు అమెజాన్.. నెట్ ఫ్లిక్స్ లాంటి స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ కు ఆదరణ పెరగడం ఓవర్సీస్ మార్కెట్ పై భారీ ప్రభావం చూపించిందన్నది కాదనలేని సత్యం.

ఇదంతా ఒక ఎత్తైతే ఓవర్సీస్ లో హిట్ అయిన సినిమాలకు సరిగా లెక్కలు చెప్పకుండా తిరిగే జనాలు కూడా ఉన్నారట. దీంతో ఫిలిం ఛాంబర్ వారు అమెరికాలో ఒక వింగ్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. ఓవర్సీస్ లో పంపిణీదారులకు నష్టం జరగకుండా ఉండేందుకు.. అలానే లాభాలు వచ్చినా లెక్కలు చెప్పకుండా తిరిగే జగజ్జంత్రీలను కట్టడి చేసేందుకు కొన్ని రూల్స్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలు ఉన్నాయట. మొత్తానికి ఓవర్సీస్ మార్కెట్ పూర్తిగా చెయ్యిజారకముందే దిద్దుబాటు చర్యలు ప్రారంభమయ్యాయని అనుకోవచ్చు.